విపక్షాల ఏడుపే నాకు ఆశీర్వాదం: సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: విపక్షాల ఏడుపే తనకు ఆశీర్వాదమని  సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. వారు తనను తిడుతుంటే సంగీతం వింటున్నట్టు ఉంటుందని వ్యాఖ్యానించారు. పూర్వకాలంలో మునులు యాగాలు చేస్తుంటే రాక్షసులు అడ్డుకొనేవారని.. ప్రస్తుతం రాష్ట్రంలో కొందరు నేతలు రాక్షసుల్లాగానే ప్రవర్తిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాప్రభుత్వం అభివృద్ధి చెేస్తుంటే కొందరు మారిచుల్లా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఫ్యూచర్ సిటీలో ప్రజలందరికీ రక్షణ ఉండాలనే ఉద్దేశ్యంతో కమిషనరేట్ ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం ఆయన ఫ్యూచర్‌ సిటీలోని (Future City) మీర్‌ఖాన్‌పేట్‌లో సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేస్తామన్నారు.

పేదలకు భూములు పంచాం

గతంలో తెలంగాణ ప్రాంతంలో దున్నేవాడికి భూమి కావాలన్న నినాదంతో సాయుధ తెలంగాణ పోరాటం సాగిందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుర్తు చేశారు. నక్సల్ బరి పోరాటం కూడా అదే లక్ష్యంతో ఆవిర్భవించిందన్నారు. అయితే ఇందిరాగాంధీ అసైన్‌మెంట్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను పేదలకు పంచారని.. సాయుధ తెలంగాణ పోరాట లక్ష్యాలను ఆమె నెరవేర్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం మావోయిస్టుల చేసిన పోరాటం ఫలించిందని.. అందుకే వారిని జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతున్నామన్నారు.

దగా పడుతున్నది రైతు మాత్రమే ..

ఈ ప్రపంచంలో ఎక్కువ దగా పడుతున్నది రైతు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతు పండించిన పంటకు తను ధర నిర్ణయించే పరిస్థితి లేదని.. మార్కెట్ లోని దళారులే ఆ పని చేస్తుంటారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర తీసుకొచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో తీవ్రమైన కరువుతో అంబలి కేంద్రాలు పెట్టేవారని.. ఆ సమస్యను ఉపాధి హామీ పథకం ద్వారా కొంతమేరకు అధిగమించగలిగామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

పరిహారం చెల్లిస్తాం

ఫ్యూచర్ సిటీ లాంటి పెద్ద కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కొన్ని లోపాలు కూడా జరుగుతాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాటిని తాము అధిగమిస్తామన్నారు. రైతులకు సకాలంలో న్యాయంగా పరిహారం చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందితే రంగారెడ్డి జిల్లా స్వరూపమే మారిపోతుందని పేర్కొన్నారు.

Read Also: భారీ శుభవార్త.. నర్సింగ్ ఆఫీసర్లకు త్వరలో నియామక పత్రాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>