కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పేదోడి నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పిలుపునిచ్చారు. బుధవారం టీపీసీసీ పిలుపు మేరకు మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలోని గాంధీ విగ్రహం వద్ద మహా ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరెయ్యారు. అంతకుముందు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాదయాత్రగా అశోక్ టాకీస్ వరకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి మహా ధర్నాలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన (Yennam Srinivas Reddy) మాట్లాడుతూ.. ఈ ధర్నా ఒక్కరోజు కార్యక్రమం మాత్రమే కాదు, ఇది నిరంతర పోరాటానికి నాంది కావాలన్నారు. ఈ రోజు దేశంలో ఒక చేతగాని ప్రభుత్వం కొనసాగుతోందని, విదేశీ ఒత్తిడులకు లోనై, ప్రజల సమస్యలను పట్టించుకోని పాలన సాగుతోందని ఆరోపించారు. దేశ ప్రజలను బాధల్లోకి నెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు అంబరాన్నంటుతున్నాయిని, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజల్ని నలిపేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో, సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలపై భారం పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా పాలన సాగించింది అని ఆయన గుర్తు చేశారు.
గ్రామ గ్రామానికి, బస్తీ బస్తీకి వెళ్లి ప్రజలకు నిజాలు తెలియజేయాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బహిర్గతం చేయాలని చెప్పారు. దేశానికి సమతుల్యమైన నాయకత్వం అవసరం ఉందని, అందరినీ సమానంగా చూసే నాయకుడి అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందన్నారు. ఒకే వ్యక్తికి పదే పదే అధికారం ఇవ్వడం వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, ప్రపంచ దేశాల్లో కూడా పరిమిత కాలం మాత్రమే నాయకత్వం ఇస్తారన్నారు. మన దేశంలో కూడా మార్పు అవసరం ఉందని, ఈ రోజు ప్రారంభమైన ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో మరింత బలపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సాయిబాబా, రాములు యాదవ్, సీజే బెనహర్, రాజు భాయి, ఫయాజ్, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవేజ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అజ్మత్ అలి, నగర కార్పొరేటర్లు హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: అవినీతి నిరూపిస్తే రాజీనామా: అడ్లూరి
Follow Us On: X(Twitter)

