Mobile Popup Ad
Mobile Popup Ad

చెలరేగిన భారత్.. అఫ్ఘాన్‌పై అద్భుత విజయం

కలం, స్పోర్ట్స్ : చెన్నై వేదికగా అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డే (IND vs AFG) లో టీమిండియా ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో అఫ్ఘానిస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించారు. అఫ్ఘాన్ తమ ముందు ఉంచిన 219 పరుగుల లక్ష్యాన్ని 29 ఓవర్లలోనే ఛేదించారు. బ్యాటింగ్‌లో ఓపెనర్ జైస్వాల్ సెంచరీతో ప్రత్యర్థులను చీల్చిచెండాడు. తొలుత బౌలింగ్‌లో ప్రసిద్ధ కృష్ణ మెరుపులు మెరిపించాడు. అప్ఘాన్ స్క్వాడ్‌లో సగం మందిని పెవిలియన్ చేర్చి తన సత్తా చాటాడు.

ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ వీరవిహారం చేశారు. అఫ్ఘాన్ ప్లేయర్లకు చుక్కలు చూపించారు. ఒక్క వికెట్ పడకుండా 170 పరుగులు చేసి విజయాన్ని ఖరారు చేశారు. ఆ సమయంలో రోహిత్ శర్మ క్యాచ్ ఔట్ అయ్యాడు. కానీ జైస్వాల్ మాత్రం తన జైత్రయాత్రను కొనసాగించాడు. ఇక అఫ్ఘాన్ ప్లేయర్ల విషయానికి వస్తే బ్యాటింగ్‌లో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత ఒమర్జాయ్ అర్థశతకంతో పర్వాలేదనిపించినా మిగిలిన వారంతా అతితక్కువ స్కోర్‌కే వెనుదిరగడంతో భారత్ ముందు భారీ స్కోర్ ఉంచడంలో అఫ్ఘాన్ విఫలమయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌కు భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తీశాడు. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (5), ఇబ్రహీం జద్రాన్ (11)లతో పాటు రహ్మత్ షా (5)లను తక్కువ స్కోర్లకే పెవిలియన్ పంపాడు. కేవలం 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ అఫ్ఘానిస్థాన్‌ను కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (131 బంతుల్లో 102, 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్నాడు.

అతనికి అజ్మతుల్లా ఒమర్జాయ్ (50) చక్కని సహకారం అందించడంతో ఐదో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత మహ్మద్ నబీ 23 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 21 పరుగులు, రషీద్ ఖాన్ 7 బంతుల్లో 5 పరుగులు, ఎఎమ్ గజన్‌ఫర్ 1 పరుగు, ఫరీద్ అహ్మద్ సున్నా డకౌట్ అయ్యాడు. జియావుర్ రహ్మాన్ 7 బంతుల్లో 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు లభించాయి. దీనితో అఫ్ఘానిస్థాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది.

భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ కెరీర్ బెస్ట్ బౌలింగ్‌ను ప్రదర్శించాడు. అతను తన 8.2 ఓవర్లలో 2 మేడిన్లతో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అఫ్ఘాన్ నడ్డి విరిచాడు. గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే తలా ఒక వికెట్ సాధించారు. వాషింగ్టన్ సుందర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తన 8 ఓవర్లలో 2 మేడిన్లతో కేవలం 23 పరుగులు ఇచ్చి పరుగుల వేగాన్ని నియంత్రించాడు. అనంతరం 219 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. అఫ్ఘాన్ బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో చెడుగుడు ఆడుకున్నారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 22.5 ఓవర్లలోనే 170 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయాన్ని ఖాయం చేశారు.

రోహిత్ శర్మ (69 బంతుల్లో 79, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అవుటైనప్పటికీ, జైస్వాల్ (86 బంతుల్లో 110 నాటౌట్, 14 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో అజేయంగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (20 నాటౌట్)తో కలిసి జైస్వాల్ మిగిలిన పనిని పూర్తి చేశాడు. ఎక్స్‌ట్రాల రూపంలో 15 పరుగులు వచ్చాయి. దీనితో భారత్ కేవలం 28.4 ఓవర్లలోనే ఒకే ఒక్క వికెట్ నష్టానికి 224 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్ల ధాటికి అఫ్ఘాన్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. మహ్మద్ నబీ మాత్రమే 7.4 ఓవర్లలో 47 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. మిగిలిన బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2 ఓవర్లలో 26 పరుగులు, ఫరీద్ అహ్మద్ 5 ఓవర్లలో 55 పరుగులు, రషీద్ ఖాన్ 7 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

Read Also: బ్రెజిల్‌కు భారీ ఊరట.. స్కాట్లాండ్ మ్యాచ్‌కు నెయ్‌మార్ రెడీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>