కలం, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట (Ramannapet) మండల పరిధిలో ప్రతిపాదించిన అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిగా రద్దు చేస్తూ అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్థానిక ప్రజలు, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో భువనగిరి కలెక్టరేట్‌లో శనివారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు ఏకతాటిపైకి వచ్చి ప్రాజెక్టు రద్దుకు తీర్మానించారు. కలెక్టరేట్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో అదానీ ఫ్యాక్టరీ వల్ల స్థానికంగా తలెత్తే పర్యావరణ ఇబ్బందులపై విస్తృతంగా చర్చించారు.
ఫ్యాక్టరీ ఏర్పాటుతో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, కాలుష్యం పెరిగి వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల మనోభావాలను, ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ ఫ్యాక్టరీ ప్రతిపాదనను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ప్రజాప్రతినిధులు గట్టిగా పట్టుబట్టడంతో, ఫ్యాక్టరీ రద్దు నిర్ణయాన్ని కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రకటనతో రామన్నపేట మండల ప్రజల్లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న కీలక నేతలు మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో స్థానిక ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టే ఏ ప్రాజెక్టునూ ఈ ప్రభుత్వం బలవంతంగా రుద్దబోదని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయమే అత్యంత ముఖ్యమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నడుచుకుంటుందని పేర్కొన్నారు. స్థానికుల జీవనోపాధికి, వ్యవసాయానికి, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కీలక అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు మరియు భారీ సంఖ్యలో రామన్నపేట ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.

