కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా రేసింగ్ స్టార్ జాక్ మిల్లర్ (Jack Miller), ప్రిమా ప్రామాక్ యమహా మోటో జీపీ జట్టు విడిపోనున్నాయి. 2026 సీజన్ ముగిసే సమయానికి ఈ అనుబంధానికి తెరపడనుంది. అరగాన్ గ్రాండ్ ప్రిక్స్‌కు ముందు యమహా రేసింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రెండు విడతల్లో ఐదు సీజన్ల పాటు యమహాతో కలిసి ప్రయాణించిన మిల్లర్‌కు జట్టు యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. యమహా ప్రాజెక్ట్ అభివృద్ధిలో మిల్లర్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. ఆయన సాంకేతిక పరిజ్ఞానం, విలువైన ఫీడ్‌బ్యాక్, జట్టు పట్ల అంకితభావాన్ని యమహా మోటార్ రేసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పాలో పావేసియో ప్రశంసించారు.
2015లో మోటో జీపీలో అరంగేట్రం చేసిన జాక్ మిల్లర్.. హోండా, డుకాటి, కేటీఎమ్, యమహా వంటి ప్రముఖ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. కెరీర్‌లో నాలుగు రేసుల్లో విజయం సాధించారు. యమహా ప్రాజెక్ట్‌లో చేరినప్పటి నుంచి ఆయన అందించిన సేవలు ఎంతో ఉపయోగపడ్డాయని పావేసియో తెలిపారు. మరోవైపు ప్రామాక్ రేసింగ్ టీమ్ ప్రిన్సిపల్ పాలో కాంపినోటి కూడా మిల్లర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది రైడర్లు వచ్చి వెళ్తుంటారని, కానీ మిల్లర్ మాత్రం ప్రామాక్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ట్రాక్‌పై విజయాలతో పాటు జట్టులో ఆయన వ్యక్తిత్వం కూడా ఎంతో గొప్పదని కొనియాడారు.
మిల్లర్‌తో కలిసి సాగిన ప్రయాణం ముగుస్తుండటం బాధాకరమే అయినా.. క్రీడల్లో ఇలాంటి నిర్ణయాలు సహజమని కాంపినోటి పేర్కొన్నారు. మిల్లర్ కుటుంబానికి భవిష్యత్తులో మంచి జరగాలని ఆకాంక్షిస్తూ, ప్రామాక్ కుటుంబంలో ఆయనకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. ఫాక్స్ స్పోర్ట్స్ కథనం ప్రకారం.. 2027లో మిల్లర్ యమహా వరల్డ్ సూపర్‌బైక్ సిరీస్‌లో చేరే అవకాశం ఉంది. 2025లో యమహా కొత్త ప్రాజెక్ట్‌లో భాగమైన మిల్లర్.. సాంకేతిక సూచనలు అందిస్తూ ప్రామాక్ బైక్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. 2025 యూఎస్‌ఏ గ్రాండ్ ప్రిక్స్‌లో ఐదో స్థానంలో నిలిచిన ఆయన, సుజుకా 8 అవర్స్ 46వ ఎడిషన్‌లోనూ పాల్గొన్నారు.

