షాకిచ్చిన అర్జెంటీనా.. వరల్డ్ కప్‌లో ముగిసిన భారత్ కథ!

కలం, స్పోర్ట్స్‌: ఎఫ్‌ఐహెచ్‌ పురుషుల హాకీ వరల్డ్‌కప్‌ (Mens FIH Hockey World Cup) 2026లో భారత జట్టు ప్రయాణం తీవ్ర నిరాశతో ముగిసింది. అమ్‌స్టెల్‌వీన్‌లో జరిగిన పూల్‌-ఈ కీలక మ్యాచ్‌లో అర్జెంటీనా 5-3తో భారత్‌ను ఓడించింది. దీంతో భారత జట్టు సెమీఫైనల్‌ ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌కు కేవలం విజయం సరిపోదు.. మెరుగైన గోల్‌ వ్యత్యాసం కూడా అవసరమైంది. అయితే అర్జెంటీనా ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్‌ మొదటి నిమిషంలోనే జోవాకిన్‌ తొస్కానీ గోల్‌ చేసి అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. ఆరో నిమిషంలో నికోలస్‌ దెల్లా తోర్రె పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో అర్జెంటీనా 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

10వ నిమిషంలో సుఖ్‌జీత్‌ సింగ్‌ అద్భుతమైన ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌ ఖాతా తెరిచింది. దీంతో భారత్‌ పుంజుకుంటుందని భావించినా.. ద్వితీయార్థంలో రక్షణ లోపాలు వెంటాడాయి. 33వ నిమిషంలో టోమాస్‌ డొమెన్‌ రివర్స్‌ షాట్‌తో అర్జెంటీనాకు మూడో గోల్‌ అందించాడు. 45వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను కూడా డొమెన్‌ గోల్‌గా మార్చి స్కోరును 4-1కు తీసుకెళ్లాడు. 53వ నిమిషంలో లుకాస్‌ తొస్కానీ మరో గోల్‌ చేయడంతో అర్జెంటీనా 5-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. చివరి నిమిషాల్లో భారత్‌ పోరాడింది. 58వ నిమిషంలో సుఖ్‌జీత్‌ సింగ్‌ రెండో గోల్‌ సాధించగా, 60వ నిమిషంలో హార్దిక్‌ సింగ్‌ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచాడు. అయినప్పటికీ సమయం ముగియడంతో భారత్‌ 3-5తో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో పూల్‌-ఈలో భారత్‌ ఒక్క పాయింట్‌ కూడా సాధించలేకపోయింది. దీంతో సెమీఫైనల్‌ అవకాశాలు చేజారాయి. ఇక భారత్‌ వర్గీకరణ పోరులో బెల్జియంతో 7వ లేదా 8వ స్థానం కోసం తలపడనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>