ఇచ్చోడలో మోసాల ముఠా గుట్టురట్టు

కలం, ఆదిలాబాద్: మంత్రతంత్రాలు, పూజలతో డబ్బులను రెండింతలు, నాలుగింతలు చేస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఇచ్చోడ పోలీసులు (Ichoda Police) రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.3.74 లక్షల నగదు, మూడు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 19న ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 44 సమీపంలో, టీజీడబ్ల్యూఆర్‌జేసీ పాఠశాల వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి దగ్గర ఈ ముఠా మోసానికి పాల్పడినట్లు తెలిపారు.

బాధితుడు తోకల రాజును మంత్రతంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి రూ.3 లక్షలు తీసుకున్నారు. అనంతరం అతడితో పాటు వచ్చిన శ్రీపతి శంకర్‌పై దాడి చేసి కారులో పరారయ్యారు. వారం రోజుల క్రితం ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద బాధితులకు నిందితులు పరిచయమయ్యారు. తమకు మంత్రశక్తులు ఉన్నాయని, పూజల ద్వారా ఒక రూపాయి నోటును పది రూపాయలుగా మార్చగలమని నమ్మించారు. ఈ నెల 19న ఫోన్ చేసి నగదుతో ఇచ్చోడకు రావాలని చెప్పడంతో బాధితులు రూ.3 లక్షలతో అక్కడికి చేరుకున్నారు. డబ్బులు చూపిస్తున్న సమయంలో నిందితులు బలవంతంగా నగదు లాక్కొని పరారయ్యారు. మరుసటి రోజు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణలో ఈ ముఠా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లో పలువురిని మోసం చేసినట్లు తేలింది. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులను పంచుకొని కారు ఈఎంఐలు, ఇంటి నిర్మాణం, జల్సాలకు ఖర్చు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయని, రాష్ట్రవ్యాప్తంగా 24 మంది బాధితులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. ఈ మోసాలకు పాల్పడిన ఆత్రం పరశురాం, మండలి బక్కన్న, నౌగడే శేఖర్, మండలి శైలేష్, షేక్ అలీంలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇచ్చోడ రూరల్ సీఐ రమేష్, గుడిహత్నూర్ ఎస్ఐ  శ్రీకాంత్, ఇచ్చోడ ఎస్ఐ విష్ణు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>