కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మండలం సాధువెల్లి గ్రామంలో యాదగిరిగుట్ట పట్టణ సీఐ(Yadagirigutta CI) భాస్కర్ (Bhaskar) ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతున్న మోసాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ భాస్కర్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల గ్రామీణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, పిన్, సీవీవీ, యూపీఐ పిన్, పాస్‌వర్డ్‌లను అపరిచితులకు వెల్లడించవద్దని తెలిపారు. తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయకూడదని, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు.
బ్యాంకు అధికారులమని చెప్పినా ఓటీపీ, యూపీఐ పిన్ వంటి వివరాలను ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, బ్యాంకింగ్ వివరాలను షేర్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని తెలిపారు. ప్రతి ఖాతాకు బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు ఖాజా మొయినుద్దీన్, ఇంద్రారెడ్డి, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

