కరీంనగర్ టవర్ సర్కిల్‌లో దేశభక్తి గీతాలాపన

కలం, కరీంనగర్ :  కరీంనగర్‌లోని ప్రముఖ వ్యాపార, వాణిజ్య కూడలి టవర్ సర్కిల్‌లో (Karimnagar Tower Circle)  నగరంలోనే తొలిసారిగా ప్రతిరోజూ పూర్తి స్థాయిలో ‘వందేమాతరం’(Vande Mataram) గీతాలాపన కార్యక్రమం ప్రారంభమైంది. టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు టవర్‌పై నుంచి ‘వందేమాతరం’ గీతం ప్రసారం కానుంది.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర సంగ్రామంలో ‘వందేమాతరం’ నినాదం కోట్లాది మంది త్యాగధనుల్లో దేశభక్తిని నింపిందన్నారు. నేటి తరం యువత, నగర ప్రజల్లోనూ అదే జాతీయ స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఉదయం నగరంలో వందేమాతరం గీతం ప్రసారం కావడం ద్వారా ప్రజల్లో సానుకూల దృక్పథం, మానసిక ప్రశాంతత, దేశం పట్ల అంకితభావం పెంపొందుతాయని పేర్కొన్నారు.

నిత్యం వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే చారిత్రాత్మక ప్రధాన కూడలిలో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు పూర్తి వందేమాతరం గీతాన్ని వినిపించేలా టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేసిన ఏర్పాట్లు అభినందనీయమని అన్నారు. గీతం ప్రారంభమైన సమయంలో నగర పౌరులు, వ్యాపారులు, వాహనదారులు ఎక్కడికక్కడ గౌరవసూచకంగా నిలబడి జాతీయ భావాన్ని చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వంగల పవన్, రామన్, టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు, టవర్ సర్కిల్ ప్రాంతానికి చెందిన వైశ్య సోదరులు, మహిళలు, నగర పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>