కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనాన్ని అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ (రూ. 5 లక్షల జీవిత బీమా పథకం) దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కరీంనగర్ నగరంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు శుక్రవారం సంబంధిత నమోదు శిబిరాన్ని సందర్శించి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.
ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, నిబంధనలపై అధికారులను అడిగి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. కుటుంబాన్ని పోషించే 18 నుండి 59 ఏళ్ల వయస్సు గల వ్యక్తి ఈ బీమాకు అర్హులని, వయస్సు ధృవీకరణకు ఆధార్ కార్డు ప్రతిని ప్రాతిపదికగా తీసుకుంటున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సమీపంలోని మున్సిపల్ కార్యాలయంలో లేదా వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొయినుద్దీన్, ఆర్ఐలు కలీముల్లా ఖాన్, కొత్తకొండ శ్యామ్ సుందర్, వార్డు ఆఫీసర్ పారిపెల్లి రాజు, జవాన్ నాగరాజు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

