కలం, కరీంనగర్ : నిస్సహాయులైన నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించి, వారి జీవితాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్లను (Cheyutha Pension) అందిస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally) అన్నారు. బుధవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్లో నగరపాలక సంస్థ 7, 8వ డివిజన్ల పరిధిలోని సదాశివపల్లి, అల్గునూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలను అన్ని విధాలుగా ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని తెలిపారు.
ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ వారి సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోందన్నారు. ముఖ్యంగా గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు ఇళ్ల మంజూరులో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గురువారం సిద్ధిపేటలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా అందించే రూ.5 లక్షల జీవిత బీమా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, 8వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నందిని, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి మల్లేశం గౌడ్, 7వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కంది చిన్న అశోక్ రెడ్డి, పోరండ్ల పీఏసీఎస్ చైర్మన్ గోపు తిరుపతిరెడ్డి, పార్టీ నాయకులు ఆకుల ఉదయ్, గోపు మల్లారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కంది లక్ష్మీనారాయణ రెడ్డి, ఏనుగు చుక్కారెడ్డి, తొర్తి అరవింద్, బుర్ర శ్రీకాంత్, సూర్య తదితరులు పాల్గొన్నారు.

