కలం, వెబ్ డెస్క్ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ (Yadadri Temple) కొండపై ప్రమాదం చోటుచేసుకుంది. కార్తీక మాసోత్సవాల సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన బైక్ పార్కింగ్ షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలడంతో పది మంది భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ పరిసరాల్లో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా బైక్ పార్కింగ్ కోసం తెల్లటి పండల్ టెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా బలంగా ఈదురుగాలులు వీచడంతో షెడ్డు తట్టుకోలేక కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న భక్తులు టెంట్ కింద చిక్కుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది, స్థానికులు గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉత్సవాల ఏర్పాట్లలో భద్రతా చర్యలు మరింత పటిష్టంగా చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

