యాదాద్రి జిల్లాలో ‘సంకల్ప్’ కార్యాచరణకు శ్రీకారం

కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలో నవజాత శిశు మరణాల నివారణపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పుట్టిన బిడ్డల ప్రాణాలను కాపాడటం, శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్‌కు తగ్గించడం లక్ష్యంగా ‘సంకల్ప్’ కార్యక్రమాన్ని (Sankalp Programme) క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసేందుకు కలెక్టర్ అనురాగ్ జయంతి కార్యాచరణకు ఆదేశించారు. శిశు మరణాల నివారణను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని వైద్య, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశం ఈ అంశంపై అధికార యంత్రాంగంలో కదలిక తీసుకొచ్చింది. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ తణిగైనాథన్ ఆధ్వర్యంలో అమలైన ‘సంకల్ప్’ కార్యక్రమం అనుభవాలను యాదాద్రి జిల్లాలోనూ వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ సహకారంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.

హైరిస్క్ గర్భిణుల గుర్తింపే కీలకం!

గర్భిణుల్లో ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తిస్తున్నారా? ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో వైద్యం అందుతోందా? ప్రసవం అనంతరం నవజాత శిశువులకు అవసరమైన వైద్య సంరక్షణ అందుతోందా? అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో చర్చించారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించడం, సురక్షిత ప్రసవాలు, పుట్టిన వెంటనే శిశువులకు అత్యవసర వైద్య సంరక్షణ కల్పించడం ద్వారా మరణాల రేటును తగ్గించవచ్చని వైద్య నిపుణులు వివరించారు.

ఆదిలాబాద్ అనుభవం.. యాదాద్రిలో అమలు!

ఆదిలాబాద్ జిల్లాలో ‘సంకల్ప్’ కార్యక్రమం అమలు చేసిన విధానం, సాధించిన ఫలితాలు, శిశు మరణాల నివారణకు అనుసరించిన పద్ధతులపై ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ తణిగైనాథన్ ప్రత్యేక సెషన్ నిర్వహించారు. జిల్లాలో అమలు చేయాల్సిన వ్యూహంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గర్భిణుల నుంచి ప్రసవానంతర దశ వరకు వైద్య సిబ్బంది నిరంతర పర్యవేక్షణ, ఆసుపత్రుల మధ్య సమన్వయం, శిశువుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా అవసరమని వివరించారు. ఈ సందర్భంగా నవజాత శిశు సంరక్షణ, అంచనా పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను కలెక్టర్ విడుదల చేశారు. సింగిల్ డిజిట్ లక్ష్యం కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇచ్చేలా కార్యాచరణ ఉండాలని అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సూర్యశ్రీ రావు, రామన్నపేట ఏహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆలేరు సీహెచ్‌సీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న రాథోడ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ కవిత, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>