కోట్లలో సీఎంఆర్ బకాయిలు.. కరీంనగర్‌లో మిల్లర్ల లీలలు!

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిల వ్యవహారంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కేంద్రంగా మారింది. ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి బియ్యంగా అందించడంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మిల్లుల నిర్వాహకులు అక్రమాల (Karimnagar CMR Scam)కు పాల్పడినట్టు తేలింది. ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రికవరీ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వందల కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని డిఫాల్ట్ చేసినట్లు బట్టబయలైంది. ఇందుకు ఆర్టీఐ ద్వారా కరీంనగర్ జిల్లా పౌరసరఫరాల సంస్థ వెల్లడించిన అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా మేనేజర్ అందించిన అధికారిక సమాచారం మేరకు జిల్లావ్యాప్తంగా 20 ప్రధాన రైస్ మిల్లులు సీఎంఆర్ బియ్యాన్ని గడువు దాటినా అందించకుండా, వందలాది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగ్గొట్టి రూ.కోట్లలో బాకీ పడ్డాయి.

20 మిల్లులు.. రూ.కోట్లలో బకాయి

ఉమ్మడి జిల్లాలో సీఎంఆర్ పెండింగ్ మిల్లులు ఇలా.. మొలంగూర్కు చెందిన పవనసుత ట్రేడర్స్ 1,574.81 మెట్రిక్ టన్నులు (రూ. 5,48 కోట్లు), మానకొండూర్ అన్నారానికి చెందిన లక్ష్మీశ్రీ మిల్లు 762.779 మెట్రిక్ టన్నులు (రూ.1,82 కోట్లు), శ్రీ వసుధ ఇండస్ట్రీస్ 648.198 మెట్రిక్ టన్నులు (రూ.1.55 కోట్లు), శ్రీ వైష్ణవి ఇండస్ట్రీస్ 641.764 మెట్రిక్ టన్నులు (రూ.1,53 కోట్లు), బోర్నపల్లికి చెందిన సాయి ట్రేడర్స్ 631.356 మెట్రిక్ టన్నులు (రూ.2,19 కోట్లు), శ్రీ మహాలక్ష్మి ఆగ్రో 429.407 మెట్రిక్ టన్నులు (రూ.1,49 కోట్లు), పెద్దపాపయ్యపల్లికి చెందిన వంశీ ఇండస్ట్రీస్ 543.767 మెట్రిక్ టన్నులు (రూ.1,89 కోట్లు)

కరీంనగర్ కు చెందిన రామలింగేశ్వర 558.850 మెట్రిక్ టన్నులు (రూ.1,86 కోట్లు) లక్ష్మీదేవిపల్లికి చెందిన శ్రీ శ్రీ వీరభద్ర మిల్లు 463.371 మెట్రిక్ టన్నులు (రూ.1,61 కోట్లు), అర్నకొండకు చెందిన సౌజన్య ఆగ్రో 323.392 మెట్రిక్ టన్నులు రూ.1.12 కోట్లు) బుజునూర్ కు చెందిన శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్ 312.852 మెట్రిక్ టన్నులు (రూ.1. 08 కోట్లు) శంకరాపట్నంకు చెందిన శ్రీ లక్ష్మి రాజాపూర్ 294.923 మెట్రిక్ టన్నులు (రూ.70. 60లక్షలు).. ఇలా 20 మిల్లుల్లోనే రూ.20.14 కోట్లకుపైగా బకాయి పడ్డారు. వీరు కేవలం డిఫాల్టర్లు మాత్రమేనని సమాచారం. ఇంకా జిల్లావ్యాప్తంగా గత రెండు సీజన్ల నుంచి బకాయి పడ్డ మిల్లర్ల విలువ వందలాది కోట్ల పైనే ఉంటుంది.

అప్పటి మంత్రి పాత్రపైనా ఆరోపణలు

బీఆర్ఎస్ హయాంలో అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి అండదండలతో కరీంనగర్ వేదికగా పెద్ద ఎత్తున సీఎంఆర్ సిండికేట్’ నడిచిందనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. మంత్రికి బినామీగా వ్యవహరించిన ఒక లోకల్ వ్యాపారి ద్వారా సర్దుబాట్లు, అక్రమాలు జరిగాయని, కేటాయింపుల్లో రూల్స్ పాటించకుండా మిల్లర్లకు ధాన్యం అప్పగించారని తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ మంత్రి హస్తంతోనూ చక్కదిద్దుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ సొమ్మును చెల్లించకుండా ఎగ్గొట్టిన కొందరు మిల్లర్లు ఆ డబ్బులను రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో మళ్లించి ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేసులు పెట్టినా చలనం లేదు

సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్లపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు చేసి నోటీసులు ఇవ్వడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. లీజులు, రిజిస్ట్రేషన్లు నిలిపివేసినా అసలు బకాయిలు మాత్రం ప్రభుత్వ ఖాతాలోకి రావడం లేదు. విజిలెన్స్ నివేదికలు, నోటీసులకే పరిమితం చేస్తూ అసలు చర్యలు తీసుకోకపోవడమూ మిల్లర్లకు కలిసివస్తుందనేది చర్చలో ఉంది.

సంబంధిత జిల్లా అధికారులు ఏళ్లుగా తిష్టవేయడం, భారీగా మామూళ్లు దండుకోవడం, పైరవీలతో బదిలీలు ఆపుకోవడం వంటి చర్యలు తెలిసిన వాస్తవాలే. కేవలం చిన్నమిల్లర్లపైనే చర్యలు తీసుకుంటూ బడా మిల్లర్లను వదిలిపెడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఏ సీజన్ కు సంబంధించి ఆ సీజన్ లో ఇవ్వకుండా సర్దుబాటు చర్యలతో పాటు డిఫాల్టర్ల మిల్లర్లకే అలాట్ మెంట్ తో కమిట్ మెంట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకుని రికవరీ చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రూ.6,650 కోట్లు పెండింగ్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 2014 నుంచి 2025 వరకు మిల్లర్ల నుంచి రావాల్సిన సీఎంఆర్ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. మిల్లులకు కేటాయించిన ధాన్యం, బియ్యం విలువ సుమారు రూ. 13,399.71 కోట్లు. కాగా ప్రభుత్వం రికవరీ చేసిన బియ్యం విలువ రూ. 6,768.97 కోట్లు మాత్రమే. ఇంకా దాదాపు రూ. 6,650 కోట్లు బకాయిలు రికవరీ కావాల్సి ఉంది. ఇటీవల ‘యాక్షన్ ప్లాన్’ ద్వారా కేవలం రూ. 1,200 కోట్లు మాత్రమే అధికారులు రికవరీ చేయగలిగారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>