కలం, కరీంనగర్ బ్యూరో: లివర్ సమస్యలకు కేవలం ఆల్కహాల్ తోనే వస్తాయనే అపోహ ప్రజల్లో ఉందని.. అనేక కారణాలతో లివర్ డ్యామేజ్ అవుతుందని వైద్యులు వెల్లడించారు. వరల్డ్ లివర్ (World Liver Day) డేను పురస్కరించుకొని శనివారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో వైద్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ… రెగ్యులర్‌గా ఆల్కహాల్ సేవించడం వల్ల స్లోగా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. కల్తీ ఆహారం, కల్తీ నూనెల కారణంగా కూడా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. కోవిడ్ తర్వాత శరీరంలో ఏ చిన్న సమస్య వచ్చినా.. చాలా మంది వెంటనే పారాసిటమాల్ మాత్రలను ఆశ్రయిస్తున్నారని.. తాత్కాలిక ఉపశమనం ఇచ్చే ఈ మందులు, చాలా మందికి రోజువారీ అలవాటుగా మారిపోతున్నాయన్నారు.
పారాసిటామల్ డోస్ ఎక్కువైనా లివర్‌పై ప్రభావం చూపుతుందన్నారు. అయితే, వైద్యుల పర్యవేక్షణ లేకుండా దీర్ఘకాలంగా ఏ మందులు వాడినా ఆరోగ్యానికి హానికరమేనని సూచించారు. నిరంతర అలసట, కండరాల క్రాంప్స్, తల తిరగడం, గుండె దడ, చేతులు లేదా కాళ్లలో మొద్దుబారటం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కడుపు ఆరోగ్యాన్ని కాపాడితే… లివర్ ఆరోగ్యాన్ని కూడా కాపాడినట్లేనని తెలిపారు. కొన్ని క్యాన్సర్ల వల్ల కూడా లివర్ డ్యామేజి అయ్యే ప్రమాదం ఉందని, చెట్ల మందులు, పసర్లను నమ్ముకొని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒబెసిటీ కారణంగా ఫ్యాటిలివర్ సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయన్నాయన్నారు. లివర్‌ను కాపాడుకుంటేనే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చన్నారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్‌హెడ్ గుర్రం కిరణ్ ఆద్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో ఆసుపత్రి మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ ప్రణీత్, సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ దిలీప్ రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ తాహా, అనెస్తీషియా డాక్టర్ వినయ్, క్రిటికల్ కేర్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

