జుట్టు సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టే అద్భుత చిట్కా!

కలం, వెబ్‌డెస్క్: నేటి ఆధునిక కాలంలో జుట్టు ఊడిపోవడం (Hair Fall) అనేది వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు కేవలం వృద్ధాప్యంలోనో లేదా వంశపారంపర్యంగానో వచ్చే ఈ సమస్య, నేడు పట్టుమని ఇరవై ఏళ్లు కూడా దాటని యువతీ యువకులలో సైతం మానసిక ఆందోళనకు కారణమవుతోంది. జుట్టు రాలడం తగ్గించుకునేందుకు యువత శత విధాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే దీని కోసం నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. వాటిలో ఒకటి ఉల్లిపాయ.

ఉల్లి (Onion) చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు మన పెద్దలు. అది కేవలం ఆరోగ్యానికే కాదు, మన అందమైన జుట్టుకు కూడా అక్షరాలా వర్తిస్తుంది. ఘాటైన ఉల్లిపాయ వాసన వెనుక రాలుతున్న జుట్టును నిలిపే అద్భుతమైన సల్ఫర్‌ సైన్యం దాగి ఉందనే విషయం మనకు తెలిసిందే. ఖరీదైన షాంపూలు, ట్రీట్‌మెంట్లు విఫలమైన చోట ఈ సహజ సిద్ధమైన ఉల్లిపాయ రసం (Onion Juice) కుదుళ్లకు జీవం పోసి జుట్టును ఒత్తుగా, నల్లగా ఉండేలా కాపాడుతుందని సూచిస్తున్నారు నిపుణులు.

ఈ సల్ఫర్‌ నిధి అయిన ఉల్లిపాయ కేవలం రుచికే కాకుండా జుట్టు కుదుళ్లను కూడా దృఢంగా మార్చడంలోనూ దోహదపడుతుందట. ఇది తరతరాలుగా వస్తున్న సహజ వైద్యం. ఈ నేపథ్యంలో కేశ సౌందర్యానికి దోహదపడే ఉల్లిపాయ రసం చేసే అద్భుతాలను, జుట్టు రాలడం, జుట్టు నల్లగా ఉండటం, చుండ్రు సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతుందో తెలుసుకుందాం.

జుట్టు రాలడం తగ్గడానికి

జుట్టు రాలడం తగ్గడానికి ఉల్లిపాయ రసం చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. కెమికల్‌ షాంపూలతో పోలిస్తే ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్‌ జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణను పెంచి జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తుందట. దీని వల్ల జుట్టు ఊడిపోవడం తగ్గడమే కాకుండా తలలో ఉండే బ్యాక్టీరియా లేదా ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల ‌నువ కూడా తగ్గిందని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా జుట్టు మధ్యలోకి తెగిపోకుండా ఉల్లిపాయ రసం అడ్డుకుంటుంది.

జుట్టు బాగా పెరగడానికి

ఉల్లిపాయ రసంలో సల్ఫర్‌ పుష్కలంగా ఉండటంతో ఇది జుట్టు నిర్మాణానికి అవసరమైన కెరాటిన్‌ అనే ప్రోటీన్‌ ఉత్పత్తికి, కొల్లాజెన్‌ వృద్ధికి సహాయపడుతుందట. ఇది కొత్త జుట్టు మొలవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఉల్లిపాయ రసాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి మసాజ్‌ చేయడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే ఉల్లిపాయ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ జుట్టు దెబ్బతికుండా కాపాడి, జుట్టు వేగంగా పెరగడానికి దోహదపడతాయని సూచిస్తున్నారు నిపుణులు.

చుండ్రు నివారణకు

ఉల్లిపాయ రసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు స్కాల్ఫ్‌ ఇన్ఫెక్షన్లను, చుండ్రును తగ్గిస్తాయి. అయితే దీనిని ఎలా ఉపయోగించాలంటే కొద్దిగా ఉల్లిపాయ రసం తీసుకుని అందులో రెండు సూన్ల నిమ్మరసం లేదా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా కనీసం వారానికి ఒకసారి చేయడం వల్ల చుండ్రు సమస్యను వదలించడమే కాకుండా తల దురదను తగ్గిస్తుందట.

తెల్ల జుట్టు నివారణకు

ఉల్లిపాయ రసంలో ఉండే కాటలేస్‌ అనే ఎంజైమ్‌ జుట్టు రంగు మారకుండా చూడటంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని క్రమం తప్పకుండా వారంలో రెండు సార్లు తలకు పట్టిస్తుంటే అది జుట్టు వేళ్లను ఆరోగ్యంగా ఉంచి తొందరగా జుట్టు తెల్లబడకుండా కాపాడుతుందని సూచిస్తున్నారు నిపుణులు.

ఉల్లిపాయ రసం + కొబ్బరి నూనె

కొబ్బరి నూనె జుట్టుకు పోషణ ఇస్తే, ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కాబట్టి రెండు స్పూన్ల ఉల్లిపాయ రసంలో రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి సుమారు 5 నిమిషాల పాటు నెమ్మదిగా మర్దన చేయాలి. అనంతరం అరగంట పాటు అలానే ఉంచి శుభ్రంగా స్నానం చేయాలి.

ఉల్లిపాయ రసం + కలబంద

స్కాల్ఫ్‌ సెన్సిటివ్‌గా ఉండి జుట్టు బాగా రాలుతుంటే ఇది మంచి పరిష్కారం. అయితే రెండు స్పూన్ల ఉల్లిపాయ రసం, ఒక స్పూన్‌ కలబంద జెల్‌ తీసుకుని బాగా మిక్స్‌ చేసి ఆ మిశ్రమాన్ని సుమారు 20 నిమిషాలు పాటు ఆరిన తర్వాత స్నానం చేయాలి. కలబంద తలని చల్లబరచడమే కాకుండా జుట్టు రాలడాన్ని అరికడుతుందని సూచిస్తున్నారు నిపుణులు.

గమనించుకోవాల్సిన విషయాలు

తలకు ఉల్లిపాయ రసం మర్దన చేసిన తర్వాత వాసన పోవడానికి షాంపూతో తలస్నానం చేసిన తర్వాత నీళ్లలో కొంచెం ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ లేదా రోజ్‌ వాటర్ కలిపి జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఉల్లిపాయ రసం ఘాటుగా ఉంటుంది. కాబట్టి దీనిని ఉపయోగించే ముందు చేతిపై లేదా చెవి వెనుక కొంచెం రాసి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోండి. మంటగా అనిపిస్తే ఉపయోగించకండి. తాజాగా తయారు చేసుకున్న రసాన్ని వినియోగించడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>