సౌతాఫ్రికాపై భారత్ జోరు.. హాఫ్‌టైమ్‌కు 3-0 ఆధిక్యం

కలం, స్పోర్ట్స్ : మహిళల హాకీ ప్రపంచకప్‌లో (Womens Hockey World Cup 2026) సౌతాఫ్రికాపై భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. మ్యాచ్ తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత జట్టు 3-0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. తొలి రెండు క్వార్టర్లలో భారత క్రీడాకారిణులు అటాకింగ్ గేమ్‌తో సౌతాఫ్రికాపై ఒత్తిడి పెంచారు. మ్యాచ్ 11వ నిమిషంలో భారత్ తొలి గోల్ సాధించింది. సౌతాఫ్రికా (South Africa) సర్కిల్‌లో ఏర్పడిన గందరగోళాన్ని సునెలిత టోప్పో సద్వినియోగం చేసుకుని బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపింది. దీంతో భారత్ (India) 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి క్వార్టర్ ముగిసే సమయానికి ఇదే స్కోరు కొనసాగింది.

ఈ సమయంలో ఇషికా చౌదరికి గ్రీన్ కార్డ్ రావడంతో భారత్ రెండు నిమిషాల పాటు 10 మంది ఆటగాళ్లతో ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ సౌతాఫ్రికా ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. రెండో క్వార్టర్‌లో భారత్ మరింత దూకుడు పెంచింది. 17వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను నవనీత్ కౌర్ గోల్‌గా మలిచింది. దీంతో భారత ఆధిక్యం 2-0కు చేరింది. ఆ తర్వాత భారత్ వరుసగా మూడు పెనాల్టీ కార్నర్లు సాధించి సౌతాఫ్రికాపై ఒత్తిడి పెంచింది. 25వ నిమిషంలో మూడో పెనాల్టీ కార్నర్ సందర్భంగా దీపిక కొట్టిన డ్రాగ్-ఫ్లిక్‌ను సౌతాఫ్రికా డిఫెండర్ అడ్డుకుంది. అయితే బంతి సుశిలా చాను వద్దకు చేరగా.. ఆమె చక్కటి టచ్‌తో గోల్‌గా మలిచింది. దీంతో భారత్ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

మరోవైపు సౌతాఫ్రికా కూడా కొన్ని దాడులు చేసింది. 23వ నిమిషంలో కుడివైపు నుంచి భారత సర్కిల్‌లోకి ప్రవేశించినా స్పష్టమైన గోల్ అవకాశం సృష్టించలేకపోయింది. 29వ నిమిషంలో మరోసారి మంచి ప్రయత్నం చేసినప్పటికీ బంతి గోల్‌పోస్ట్‌కు దూరంగా వెళ్లింది. భారత్ మాత్రం పెనాల్టీ కార్నర్లతో సౌతాఫ్రికా రక్షణను పరీక్షించింది. 27వ నిమిషంలో దీపిక కొట్టిన డ్రాగ్-ఫ్లిక్‌ను సౌతాఫ్రికా గోల్‌కీపర్ అద్భుతంగా అడ్డుకుంది. చివరకు హాఫ్‌టైమ్‌కు భారత్ 3-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ ఇదే జోరు కొనసాగించి విజయాన్ని అందుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>