ఆఫీసర్ అవతారమెత్తి.. ఆప్ నేతకు యువతి పంగనామాలు

కలం, వెబ్ డెస్క్ : ఆఫీసర్ అవతారమెత్తి ఏకంగా రాజకీయ నాయకుడినే మోసం చేసిన ఘటన పంజాబ్‌ (Punjab) లో తీవ్ర సంచలనం రేపింది. పీసీఎస్ (పంజాబ్ సివిల్ సర్వీసెస్) అధికారిణిగా నటిస్తూ ఓ మహిళ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడి (AAP Leader)ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విలువైన నగలతో పరార్ కావడంతో బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆప్ పంజాబ్ సంయుక్త కార్యదర్శి అమరీందర్ సింగ్ మండోఫల్‌కు తార్న్ తారన్ జిల్లా సుర్ సింగ్ గ్రామానికి చెందిన మన్విందర్ కౌర్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది.

ఆ మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆమెను పీసీఎస్ అధికారిణిగా, ఇంకా పెళ్లికాని యువతిగా పరిచయం చేసుకున్నారు. వయసును కూడా తక్కువ చేసి చెప్పారు. వారి మాటలు నమ్మిన అమరీందర్ సింగ్, ఫిబ్రవరిలో మన్విందర్ కౌర్‌ను ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ హై-ప్రొఫైల్ వివాహానికి పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, మంత్రి తరుణ్‌ప్రీత్ సింగ్ సౌంధ్‌లతో సహా పలువురు ప్రముఖ ఆప్ నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. వేడుకల్లో రాజకీయ ప్రముఖులు నూతన వధూవరులతో కలిసి భాంగ్రా నృత్యాలు చేసిన ఫోటోలు, వీడియోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి.

పెళ్లయిన కొద్ది నెలలకే ఆ మహిళ బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనుమానం వచ్చిన అమరీందర్ సింగ్ ఆమె వివరాలపై ఆరా తీయడంతో షాక్ గురయ్యాడు. ఆ మహిళకు ఇదివరకే పెళ్లై విడాకులు అయ్యాయని, అంతేకాకుండా ఆమెకు 18 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడని తెలిసింది. దీంతో మోసపోయాయని తెలుసుకున్న అమరీందర్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలు మన్విందర్ కౌర్‌తో పాటు ఆమెకు సహకరించిన మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆమె సోదరుడు తర్లోచన్ సింగ్, తల్లి వరీందర్‌జిత్ కౌర్, బంధువు నరీందర్ సింగ్ గోల్డీ, వదిన రూపిందర్ కౌర్, సుర్ సింగ్ మాజీ సర్పంచ్ సురీందర్ సింగ్ రాణాల పేర్లను చేర్చారు. నిందితులందరినీ పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>