కలం, కల్వకుర్తి: కల్వకుర్తి (Kalwakurthy) నియోజకవర్గంలో దారుణ హత్య చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన నారుమళ్ల అనూష (22), చెన్నయ్యకు ఆరేళ్ల కిందట వివాహం అయింది. వారికి ఒక కుమారుడు. కల్వకుర్తి పట్టణంలో అనూష ఓ షాపులో పనిచేస్తుండగా.. చెన్నయ్య హోటల్లో పని చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన రాములు అనూషతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో బుధవారం రాత్రి రాములు అనూషను గ్రామ శివారులోకి తీసుకెళ్లి హత్య చేసి,పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
అనంతరం అక్కడి నుంచి రాములు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి, వెల్దండ సీఐలు భీమ్ కుమార్, రఘువీరారెడ్డి, ఎస్సై యుగంధర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాములుతో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వెల్దండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

