కలం, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పెంపు ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో పార్లమెంటు వేదికగానే కేంద్ర హోం మంత్రి లెక్క చెప్పేశారు. డీలిమిటేషన్ కమిషన్ (Delimitation Commission) చేయాల్సిన సగం పనిని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చేసిందని హోమంత్రి మాటలతో స్పష్టమైంది. ఇక డీలిమిటేషన్ కమిషన్ చేయాల్సింది కేవలం ఆయా రాష్ట్రాల్లో సీట్లను ఎక్కడ పెంచాలి, వాటి సరిహద్దులను ఎలా ఫిక్స్ చేయాలనేదే. రాష్ట్రపతి నియమించే డీలిమిటేషన్ కమిషన్ (Delimitation Commission) స్వయంప్రతిపత్తి సంస్థగా ఉంటుందనే చెప్పుకుంటున్నా కీలకమైన నిర్ణయాన్ని కేంద్రం ఇప్పటికే ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని సీట్లు పెరుగుతాయో బిల్లులోనే స్పష్టత ఇచ్చింది. ఇక ఏ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో, డీలిమిటేషన్ తర్వాత ఎన్ని పెరుగుతాయో అమిత్ షా పట్టిక తరహాలో ప్రకటించేశారు. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరగనున్నదీ అక్కడి ప్రజలకు స్పష్టమైన మెసేజ్ వెళ్ళింది.
జనాభా లెక్కలతో సంబంధం లేకుండానే…
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో టేబుల్ చేసిన డీలిమిటేషన్ బిల్లులో దాని ఏర్పాటు మొదలు విధివిధానాల వరకు ఏకరువు పెట్టింది. ఆ కమిషన్ (Delimitation Commission) ఏర్పడేనాటికి అందుబాటులో ఉన్న లేటెస్ట్ సెన్సస్ గణాంకాలను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర సర్కార్ వివరించింది. కానీ ఇప్పుడు జనాభా లెక్కలతో సంబంధమే లేకుండా ప్రో-రేటా పద్ధతిలో ఏ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయో అన్నింటికీ ఒకే ఫార్ములాతో సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు అమిత్ మాటల్లో తేలిపోయింది. దీంతో సీట్ల సంఖ్యను పెంచే నిర్ణయంలో డీలిమిటేషన్ కమిషన్‌కు ఎలాంటి అధికారాలూ లేనట్లయింది. జనాభా లెక్కలను కేవలం ఆయా రాష్ట్రాల్లోని నియోజకవర్గాలను పునర్ వ్యవస్థీకరించడం, రిజర్వుడు నియోజకవర్గాలను ఖరారు చేయడం, కొత్తవాటిని క్రియేట్ చేయడం, వాటి సరిహద్దులను ఫిక్స్ చేయడమే డీలిమిటేషన్ కమిషన్ పని అని వెల్లడించినట్లయింది.
విధాన నిర్ణయాన్ని వెల్లడించిన కేంద్రం..
దేశంలో మొత్తం లోక్‌సభ స్థానాలు ఎన్ని ఉండాలో కేంద్ర ప్రభుత్వం ఒక ఫ్రేమ్‌లో ఫిట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని, ఉద్దేశాన్ని, హామీని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గుతుందని, వివక్ష కొనసాగుతుందని, వీటి అవసరం లేకుండానే మిగిలిన రాష్ట్రాల్లో విజయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయడం గమనార్హం. లెక్కలతో పోల్చి వివరాలను లోక్‌సభ వేదికగా చెప్పడం వరకే ఆయన పాత్ర పరిమితమవుతుందా?.. లేక డీలిమిటేషన్ కమిషన్ తన స్వయంప్రతిపత్తిని కోల్పోయి కేంద్ర హోం శాఖ నియంత్రణలో పనిచేస్తుందా అనే సందేహాలు తలెత్తాయి. ఈ లెక్కలే తుది నిర్ణయంగా డీలిమిటేషన్ కమిషన్ ద్వారా వెల్లడవుతాయా?.. లేక కమిషన్ క్షేత్రస్థాయి అధ్యయనం, పార్టీల ప్రతినిధులతో సంప్రదింపుల తర్వాత మార్పులు చేర్పులు చేస్తుందా అనే అనుమానాలూ లేకపోలేదు.
స్వయంప్రతిపత్తి, అధికారాలు తగ్గకపోయినా..
డీలిమిటేషన్ కమిషన్‌కు చట్టబద్ధంగా దాని స్వయంప్రతిపత్తి, అధికారాలు ఉంటున్నప్పటికీ అది చేయాల్సిన పనిలోని కీలకమైన అంశమైన నియోజకవర్గాల పెంపుపై స్పష్టత వచ్చేసింది. దేశంలో మొత్తం ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉండాలన్న అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటున్నందున రాజ్యంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం తన ఉద్దేశాన్ని హోం మంత్రి ద్వారా లోక్‌సభలో చెప్పించింది. సీట్లు ఎన్ని పెరగాలో సూచనప్రాయంగా గైడ్‌లైన్స్‌ను హోం మంత్రి అఫీషియల్‌గా వెల్లడించినట్లయింది. కానీ ఆ సీట్లను ఏ ప్రాతిపదికన విభజించాలన్న ఫార్ములాను మాత్రం డీలిమిటేషన్ కమిషన్ ఫైనల్ చేస్తుంది. కమిషన్ తీసుకున్న నిర్ణయమే అంతిమంగా ఖరారవుతున్నందున దాన్ని మార్చడానికి పార్లమెంటుకు సైతం అధికారం ఉండదని రాజ్యాంగ నిపుణులొకరు తెలిపారు. ఆ కోణం నుంచి చూస్తే ఏ ప్రభుత్వం లేదా పార్టీతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ కమిషన్ సంపూర్ణ అటానమీతో పనిచేస్తుందని వివరించారు.
Read Also: మహిళా బిల్లుతోనైనా ఆ మూడు పార్టీల మనసు మారేనా?
Follow Us On : WhatsApp

