కలం, దమ్మపేట : దమ్మపేట (Dammapeta) మండలం గండుగులపల్లి అటవీ బీట్ పరిధిలో వన్యప్రాణులను వేటాడేందుకు వచ్చిన నలుగురు నిందితులను అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిన్న రాత్రి గండుగులపల్లి అటవీ ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను గండుగులపల్లి అటవీశాఖ బీట్ ఆఫీసర్ భవానీ గుర్తించారు. ఆమె తన సిబ్బందితో కలిసి వారిని వెంబడించగా, ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంతో పరారయ్యారు. అయితే మిగిలిన ఇద్దరు నిందితులను అటవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక నాటు తుపాకీ, ఐదు తూటాలు, రెండు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం ఉదయం పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను కూడా అటవీశాఖ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నలుగురు నిందితులపై అటవీశాఖ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు రేంజ్ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. అటవీ సంరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి జే.జయరాం, బేస్ క్యాంప్ సిబ్బంది నాగరాజు, లక్ష్మణ్‌లతో పాటు రేంజ్ కార్యాలయ సిబ్బంది మహిదర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. వన్యప్రాణుల వేటగాళ్లను చాకచక్యంగా పట్టుకున్న బీట్ ఆఫీసర్ భవానీని, అటవీ సిబ్బందిని ఈ సందర్భంగా అధికారులు అభినందించారు.

