కలం, వెబ్ డెస్క్ : గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం అని.. గుడిసెల గుర్తింపునకు ప్రత్యేక సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. బుధవారం హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలు, గుడిసెల గుర్తింపు, రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకం, అసంపూర్తి గృహాల వివరాల సేకరణ తదితర అంశాలపై పొంగులేటి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గుడిసెలను యుద్ధప్రాతిపదికన గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ వద్ద ఇప్పటికే ఉన్న సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధృవీకరించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల మంది తాము గుడిసెల్లో నివసిస్తున్నామని దరఖాస్తు చేసుకున్నారని, ఆ దరఖాస్తులన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించి నిజమైన అర్హులను గుర్తించాలని మంత్రి ఆదేశించారు.
గుడిసెల్లో నివసిస్తూ గతంలో ప్రజాపాలన లేదా ఇతర కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకోని నిరుపేద కుటుంబాలు ఇప్పుడు కూడా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని పొంగులేటి సూచించారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున మంజూరు చేసిన నేపథ్యంలో అర్హుల ఎంపికను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలన్నారు.

