కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. వివరాల్లోకి వెళితే.. గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి, కల్పనకు వివాహం కాగా.. ఇద్దరు పది సంవత్సరాల లోపు కూతుళ్లు ఉన్నారు. నారాయణఖేడ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న కల్పన, కొన్నేళ్ల నుంచి గైని పండరి (చింటూ) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు పండరితో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది భార్య కల్పన. ఇద్దరు కలిసి మనూర్ మండలం ఎల్గోయి గ్రామ శివారులో ముత్యంరెడ్డిని హత్య చేసి గుంతలో పూడ్చి పెట్టారు. అయితే ముత్యం రెడ్డి కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా హత్య విషయం బయటపడింది. నిందితుడు పండరి, కల్పనలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో భాగంగా పూడ్చిన ప్రదేశం నుంచి ముత్యం రెడ్డి మృతదేహాన్ని బయటకు తీస్తున్నారు.

