కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌ను (West Bengal) 15 ఏళ్ల పాటు పాలించిన మమతా బెనర్జీ శకం ముగిసిపోయింది. 293 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో బీజేపీ 190కి పైగా సీట్లు సాధించి.. అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో, కొత్త సీఎం ఎవరు అనే చర్చ జరుగుతోంది. తొలి సారి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న బీజేపీ.. ఎవరినీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చబెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. పలువురు కీలక నేతలు రేసులో ఉండగా.. వారి గురించి చర్చించుకుంటున్నారు.
సువేందు అధికారి: ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉండి, టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన.. తరువాత కాలంలో మమతతో విబేధించి బీజేపీలో చేరి, ఆమెకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న సువేందు అధికారి.. సీఎం అభ్యర్థుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. ప్రచారంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు.
సమిక్ భట్టాచార్య: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఈయన.. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆర్ఎస్సెస్ నేపథ్యంలో కలిగిన సమిక్.. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ఎంతో కాలంగా కష్టపడుతున్నారు. ఆయన సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం.. 2024లో రాజ్యసభకు ఎంపిక చేసింది.
దిలీప్ ఘోష్: పార్టీ మాజీ అధ్యక్షుడు అయిన ఈయనకు కింది స్థాయి కార్యకర్తలతో మంచి పరిచయాలు, బలమైన అనుబంధం ఉంది. 2019 లోక్ సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేలా చేశారు. ఖరగ్‌పుర్ సదార్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.
అగ్నిమిత్ర పాల్: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఈమె.. అసన్ సోల్ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహిళా కోటాలో ఈమె పేరు గట్టిగా వినిపిస్తోంది. ప్రచారంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన అగ్నిమిత్ర.. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
రూపా గంగూలీ: మాజీ రాజ్యసభ సభ్యురాలైన రూపా గంగూలీ.. రాష్ట్రంలో అందరికీ సుపరిచమైన నాయకురాలు. సోనార్ పుర్ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఈమె.. అర్బన్ ప్రాంతాల్లో గట్టి పట్టున్న నేతగా గుర్తింపు పొందారు.

