కలం, వెబ్ డెస్క్: ఉప్పు అనేది మన దైనందిన ఆహారంలో అత్యంత ముఖ్యమైన భాగమని మనందరికి తెలుసు. అయితే, ఈ మధ్యకాలంలో సాధారణంగా వాడే తెల్ల ఉప్పు కన్నా పింక్ సాల్ట్ ఆరోగ్యానికి చాలా మంచిదనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అసలు ఈ రెండింటిలో ఏది బెటర్? (White Salt vs Pink Salt) వీటి మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏంటి? అనేది మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా తెల్ల ఉప్పును సముద్రపు నీటిని శుద్ధి చేయడం ద్వారా తయారు చేస్తారు. దీని ప్రాసెసింగ్ సమయంలో సహజ ఖనిజాలు తొలగిపోతాయి. మరోవైపు, పింక్ సాల్ట్ పాకిస్తాన్‌లోని హియాలయ పర్వత ప్రాంతాల గనుల నుండి లభిస్తుంది. ఇది ఎటువంటి కెమికల్ ప్రాసెసింగ్ లేకుండా, సహజ సిద్ధంతా దొరుకుతుంది. ఇందులో ఉంటే ఐరన్ ఆక్సైడ్ వల్ల దీనికి గులాబీ రంగు వస్తుంది.
అయితే ఆరోగ్య పరంగా చూసినప్పుడు.. ఈ రెండింటిలోనూ సోడియం పరిమాణం దాదాపు ఒకేలా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. శరీరంలో సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
పింక్ సాల్ట్ (హిమాలయన్ పింక్ సాల్ట్)
పింక్ సాల్ట్ లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి 84 రకాల సూక్ష్మ ఖనిజాలు సహజంగా లభిస్తాయట. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయని చెబుతున్నారు. అంతే కాకుండా దీని స్పటికాలు తెల్ల ఉప్పుకంటే పెద్దవిగా ఉండటంతో ఒక చెంచా పింక్ సాల్ట్ తీసుకుంటే, సాధారణ ఉప్పు కంటే తక్కువ సోడియం శరీరంలోకి వెళ్తుంది. ఇది రక్తపోటును నియంత్రించాలనుకునేవారికి కొంత వరకు మేలు చేస్తుందని చెబుతున్నారు.
కానీ పింక్ సాల్ట్‌లో సహజంగా ఉండే అయోడిన్ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. దీనిని మాత్రమే పూర్తిగా వాడటం వల్ల థైరాయిడ్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణ ఉప్పుతో పోలిస్తే మార్కెట్లో పింక్ సాల్ట్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది.
తెల్ల ఉప్పు (సాధారణ ఉప్పు)
థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి, పిల్లల్లో మెదడు ఎదుగుదలకు అయోడిన్ చాలా అవసరం. తెల్ల ఉప్పులో అయోడిన్ కృత్రిమంగా కలుపుతారు కాబట్టి ఇది అయోడిన్ లోపాన్ని సమర్థవంతంగా నివారిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇది మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉంటుంది.
అయితే తెల్ల ఉప్పు తయారీలో కెమికల్ ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. సముద్రపు నీటి నుండి దీనిని తయారుచేసేటప్పుడు, తెల్లగా మార్చడానికి బ్లీచింగ్ చేస్తారని తెలిపారు. అంతేకాకుండా ఉప్పు గడ్డకట్టకుండా ఉండటానికి యాంటీ కేకింగ్ ఏజెంట్స్ కూడా కలుపుతారని పేర్కొన్నారు. ప్రాసెసింగ్ సమయంలో ఉప్పులో ఉండే ఖనిజాలన్నీ తొలగిపోతాయని, కేవలం క్టోరైడ్ మాత్రమే మిగుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా దీని కణాలు చాలా సన్నగా ఉండటం వల్ల, కొద్దిగా వాడినా ఎక్కువ సోడియం శరీరంలోకి చేరుతుందని హెచ్చరిస్తున్నారు.
ఏది బెటర్: కెమికల్స్ లేని సహజమైన ఉప్పు కావాలనుకునేవారు పింక్ సాల్ట్ ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు. కానీ, శరీరానికి అవసరమైన అయోడిన్ పూర్తిగా అందాలంటే కేవలం పింక్ సాల్ట్ మాత్రమే తీసుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అందుకే నిపుణుల సూచనల ప్రకారం వంటల్లో ఈ రెండింటినీ మార్చి మార్చి వాడటం లేదా కలిపి వాడటం ఆరోగ్యానికి అత్యంత ఉత్తమమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
పింక్ సాల్ట్ లేదా తెల్ల ఉప్పు.. ఏది వాడినప్పటికీ, WHO ప్రకారం ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు (సుమారు ఒక చిన్న టీస్పూన్) మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. ఉప్పు ఏదైనా సరే, మోతాదుకు మించి తీసుకుంటే రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
Note: ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా, చికిత్సగా పరిగణించకూడదు. సరైన నిర్ణయం కోసం ఎల్లప్పుడూ అర్హత కలిగిన డాక్టర్‌ను సంప్రదించవలెను.

