కలం, వెబ్ డెస్క్: పెళ్ళి కొత్త జీవితానికి నాంది. ఆ పెళ్ళికి ముందు ముద్రించే పెళ్ళి పత్రికలతో మరో జీవానికి కొత్త గూడు నిర్మించొచ్చని మీరెప్పుడైనా ఊహించారా. నాగ్‌పూర్‌కు చెందిన 74 ఏళ్ల అశోక్ తేవానీ ఇదే చేశారు. పాత పెళ్ళి పత్రికల(Wedding Card Crafts)తో కనుమరుగవుతున్న పిచ్చుకులకు కొత్త గూడును ఏర్పాటు చేశారు. పాత పెళ్లి పత్రికలు, చాక్లెట్ బాక్సులను సేకరించి, వాటితో అందమైన పిచ్చుక గూళ్లను తయారు చేస్తున్నారు అశోక్. గత పదేళ్లలో ఆయన ఏకంగా 2,725 గూళ్లను రూపొందించి పర్యావరణ ప్రేమికులకు ఆదర్శంగా నిలిచారు.
రిటైర్మెంట్ తర్వాత కొత్త లక్ష్యం
అశోక్ తేవాని.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 38 ఏళ్లు పనిచేసి రిటైర్ అయ్యారు. 2014లో ఒక వార్త ద్వారా దేశంలో పిచ్చుకల సంఖ్య తగ్గుతోందని తెలుసుకున్నారు. వాటి మనుగడకు తనవంతు సహాయం చేయాలనుకున్నారు. ప్రతి ఇంట్లో ఒక పక్షి గూడు ఉంటే అవి మళ్లీ వస్తాయని భావించి, తనకున్న కళా నైపుణ్యంతో గూళ్ల తయారీ మొదలుపెట్టారు. తేవాని గూళ్ల తయారీకి కొత్త వస్తువులేవీ కొనరు. కేవలం పాత పెళ్లి పత్రికలు, మందపాటి కార్డులనే వాడతారు. ఒక్కో గూడు తయారీకి దాదాపు ఐదున్నర గంటల సమయం పడుతుంది. తన ఇంటి ముందు ఒక బాక్సును ఉంచి, పొరుగువారు ఇచ్చే కార్డులను సేకరించి నెలకు 25 గూళ్ల వరకు తయారు చేస్తున్నారు.
లాభంపై ఆశలేదు
ఈ గూళ్లను ఆయన కేవలం 40 రూపాయల నామమాత్రపు ధరకే విక్రయిస్తున్నారు. ఇది కేవలం తయారీ ఖర్చుల కోసమేనని, డబ్బు కోసం తాను ఈ పని చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ గూళ్లను అలంకరణ కోసం కాకుండా, పక్షులు నివసించేలా బాల్కనీల్లో అమర్చాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం ‘గ్రామాయణ్’ అనే సంస్థతో కలిసి నాగ్‌పూర్‌లోని 20 పాఠశాలల్లో విద్యార్థులకు గూళ్ల తయారీపై అవగాహన కల్పిస్తున్నారు. కొత్త భవనాల్లో పక్షుల కోసం ప్రత్యేకంగా చిన్న గూళ్లను ఏర్పాటు చేస్తే, పిచ్చుకలు మళ్లీ మన నగరాలకు తిరిగి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: నందిని సిధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు
Follow Us On: Instagram

