కలం, వరంగల్ బ్యూరో: చారిత్రక ఓరుగల్లు (Warangal) జిల్లాలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒక పక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతుండగా, మరోపక్క మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. మానవత్వం మరిచిన మృగాళ్లు చిన్నారులను సైతం వదలడం లేదు. ఈ దారుణాలను అరికట్టేందుకు కొత్త కొత్త చట్టాలు ప్రవేశపెట్టి నేరస్థులను కఠినంగా శిక్షించినా, నేరాలకు ఫుల్ స్టాప్ పడడం లేదు.
ఆగని దారుణాలు
ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమంది బాధితులు సమాజానికి భయపడి బయటపడలేకపోతున్నారు. దీంతో కొన్ని ఘటనలు వెలుగులోకి రాక మృగాళ్లు చట్టం నుంచి తప్పించుకుంటున్నారు. కొంతమంది ధైర్యం చేసి ముందుకు రావడంతో నేరగాళ్లు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. తాజాగా హనుమకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్లో డ్యాన్స్ టీచర్ ఐదో తరగతి చదువుతున్న బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అంతకుముందు ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సర్పంచ్ భర్త యువతిపై అత్యాచారయత్నం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల కిందట భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో బాలికకు మాయమాటలు చెప్పి ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూడటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చట్టాలెన్ని చేసినా..
మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు అరికట్టేందుకు చట్టాలెన్ని చేసినా మార్పు రావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 2007లో వరంగల్ నగరానికి చెందిన 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన రౌడీ ముఠా దారుణంగా చంపి బావిలో పడేశారు. అప్పటి ఎస్పీ సౌమ్య మిశ్రా ఈ విషయంపై సీరియస్ గా స్పందించారు. తప్పించుకోవాలని చూసిన నేరస్థులు పోలీసుల ఎన్‌కౌంటర్ లో హతమయ్యారు. ఆ తర్వాత 2009లో ఇంజినీరింగ్ చదువుతున్న యువతులను వేధించిన ముగ్గురు యువకులు వారిపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దారుణం నుంచి ఒకరు బయటపడగా, మరో యువతి ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన దేశంలో సంచలనం కలిగించింది. అప్పటి ఎస్పీ సజ్జనార్ కేసు విచారణలో భాగంగా నిందితులను ప్రశ్నిస్తుండగా పోలీసులపై దాడికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నేరస్థులు చనిపోయారు. ఈ ఘటనపై మహిళా లోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. కానీ ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనలో నేరస్థులు పోలీస్ ఎన్‌కౌంటర్ లో హతమయ్యారు. ఆ తర్వాత హనుమకొండ నగరంలో రాత్రి ఇంటి స్లాబ్ పై తల్లి ఒళ్ళో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన మృగాడు అత్యాచారం చేసి చంపేశాడు. ఈ కేసులో నేరగాడికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.
Read Also: గ్యాస్ కొరత.. గ్రౌండ్ రియాలిటీ ఏంటి?
Follow Us On: X(Twitter)

