కలం, వరంగల్ బ్యూరో : అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు ద్వారా త్రినగరి రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని(MLA Naini) రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్, హనుమకొండ, ఖాజీపేటతో కూడిన త్రినగరిలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5,257.20 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డితో కలసి హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయిని రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని గత పాలకులు ఎన్నోసార్లు చెప్పినా ఆచరణలోకి తీసుకురాలేదన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5257.20 కోట్ల నిధులను కేటాయించి, అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ డీపీఆర్ ఇప్పటికే సిద్ధమైందని, ప్రముఖ సంస్థ ద్వారా పూర్తి ప్రణాళికతో తయారు చేయించినట్లు వెల్లడించారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అవుతుందని, దీనిని సకాలంలో పూర్తి చేస్తామని అన్నారు. దీనితోపాటు మామునూరు విమానాశ్రయం, నగర మాస్టర్ ప్లాన్ అమలు వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలకూ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
అభివృద్ధి జరుగుతున్న సమయంలో ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్యే నాయిని(MLA Naini) మండిపడ్డారు. ఇతరులు చేసిన పనులను తామే చేసినట్టు బీఆర్ఎస్ చెప్పుకుంటుందని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన అనేక ప్రజావ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చిన ఘనత కూడా గత పాలకులదేనన్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరుగా విభజించడం వల్ల అభివృద్ధిలో కొంత వెనుకబడిందని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో తెచ్చిన నిధులు ఎన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో తెచ్చిన నిధులు ఎన్ని అనేది ప్రజల ముందు చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.
ప్రజల ఆశీస్సులతో కేవలం రెండేళ్లలోనే ఇంత అభివృద్ధి సాధ్యమైందని పేర్కొంటూ సీఎం, మంత్రులకు జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే నాయిని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు.
Read Also: కవిత సహా 43 మందిపై కేసు నమోదు
Follow Us On: Youtube

