కలం, వరంగల్ బ్యూరో: మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా అంతర్రాష్ట్ర సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా నెట్‌వర్క్‌ను వరంగల్ పోలీసులు (Warangal Police) ఛేదించారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మీడియాకు వివరాలు వెల్లడించారు. మొత్తం 22 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 216 పాస్‌బుక్‌లు, 22 ఏటీఎం కార్డులు, వాహనాలు, స్మార్ట్‌ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముద్రా రుణాలు ఇప్పిస్తామని ప్రజలను నమ్మించి, బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారని తెలిపారు.
ఇలా సేకరించిన తరువాత ఒక్కో ఖాతాకు రూ.6 వేల నుంచి రూ.8 వేల కమిషన్‌తో వివరాలను సైబర్ నేరగాళ్లకు అందించినట్లు దర్యాప్తులో తేలిందని సీపీ శ్వేత తెలిపారు. దేశ వ్యాప్తంగా 185 సైబర్ నేర లింకులను గుర్తించి.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇంకా నలుగురు ముఠా సభ్యుల కోసం ఢిల్లీ, హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులను ఇతరులకు ఇవ్వవద్దని హెచ్చరించారు.

