కలం, నిజామాబాద్ బ్యూరో: నవభారత నిర్మాత, దేశ ప్రగతి దార్శనికులు ప్రధాని నరేంద్ర మోదీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana Gupta) స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని గంగస్థాన్‌లో స్నేహ సొసైటీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 13 సంవత్సరాలు సీఎంగా, 12 ఏళ్లు ప్రధానిగా సేవలందిస్తూ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారన్నారు. ప్రపంచంలోనే దేశాన్ని విశ్వ గురువుగా నిలబెడుతున్నారని కొనియాడారు. అన్నివర్గాల ప్రజలకు సమ న్యాయం చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతిఒక్కరూ ” ఆశీర్వాద దీపం” కూడా వెలిగించారన్నారు. ప్రజాసేవ కోసం ఆయన జీవితం అంకితం చేశారని తెలిపారు.
సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందని, ప్రధాని మోడీ పుట్టిన రోజుతోపాటు తెలంగాణ విమోచన దినం, విశ్వ కర్మ జయంతి కూడా ఉందని ఎమ్మెల్యే ధన్ పాల్ గుర్తుచేశారు. నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి పొందిన రోజన్నారు. ప్రధాని పుట్టిన రోజును పురస్కరించుకొని స్నేహ సొసైటీ దివ్యాంగులతో కలిసి వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దివ్యాంగ విద్యార్థులు నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. అంతకుముందు దివ్యాంగ పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, అంధుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, నాయకులు మారావార్ కృష్ణ, బాబీ సింగ్ స్నేహ సొసైటీ దివ్యంగా పాఠశాలల సిబ్బంది, మానసిక దివ్యాంగులు, అంధులు పాల్గొన్నారు.

