కలం, వరంగల్ బ్యూరో: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ వరంగల్ (Warangal) జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి సోమవారం సంచలన తీర్పు వెలువరించారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ పట్టణంలోని దేశాయిపేటకు చెందిన మోతుకూరి శివ అనే యువకుడికి ఫేస్‌బుక్‌లో ఓ బాలిక పరిచయమైంది. బాలికతో పరిచయం పెంచుకున్నాడు. బాలికతో సన్నిహితంగా ఉంటూ లైంగిక వేధింపులకు గురిచేశాడు. గమనించిన బాలిక తల్లిదండ్రులు అతన్ని ఇంటికి రావద్దని హెచ్చరించారు.
యువకుడి తీరుతో విసుగు చెందిన బాలిక తల్లిదండ్రులు ఇల్లు ఖాళీ చేసి ఆటోనగర్ ప్రాంతానికి నివాసం మార్చారు. అయినప్పటికీ శివ.. 2022 జూన్‌లో ఇంట్లో లేని సమయంలో బాలిక ఇంటికివెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం శివ బెయిల్ మీద బయటకొచ్చాడు.
ఈ కేసుకు సంబంధించి వరంగల్ జిల్లా పోక్సోకోర్టులో ఈ కేసు ట్రైల్ విచారణ కొనసాగింది. బాధితురాలి తరపున కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంప వెంకటరమణ వాదించారు. అప్పటి ఏసీపీ గిరి కుమార్ విచారణ అధికారిగా వ్యవహరించారు. నేరం రుజువు కావడంతో వరంగల్ జిల్లా అదనపు న్యాయమూర్తి, పోక్సో కోర్టు జడ్జి క్షమాదేశ్ పాండే.. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున నాలుగు లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో లైసెన్ అధికారిగా ఏఎస్ఐ హరికృష్ణ, కానిస్టేబుల్ రమేష్ శ్రీనివాస్ వ్యవహరించారు.

