కలం, వెబ్ డెస్క్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant)లో జరిగిన ప్రమాదంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ కాంగ్రెస్ తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో మరుగుతున్న ద్రవ ఉక్కు మీద పడి 9 మంది కార్మికులు సజీవ దహనం అవ్వడం అత్యంత విషాదకరమని షర్మిల పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు షర్మిల ప్రశ్నలు సంధించారు. స్టీల్ ప్లాంట్‌లో ఇంకెన్ని ప్రాణాలు బూడిడ కావాలి? అని షర్మిల ప్రశ్నించారు. ఎన్ని కుటుంబాలు రోడ్డున పడాలని నిలదీశారు. విశాఖ ఉక్కు పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాక్షస క్రీడ ఇంకెంత కాలం? సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు పదకొండేళ్లుగా గుండెలు బాదుకుంటున్నా ప్రభుత్వాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్లాంట్ వినాశనం ఆపాలని, ఆధునీకరించాలని రాష్ట్రమంతా ఉద్యమాలు జరుగుతుంటే పట్టించుకోరా అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్లాంట్ లో ప్రమాదానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని షర్మిల ఆరోపించారు. ఈ ఘటనకు సీఎం చంద్రబాబు (Chandrababu), ప్రధాని మోదీ (Modi) బాధ్యత వహించాలన్నారు. తుప్పు పట్టిన యంత్రాల స్థానంలో కొత్తవి సమకూర్చి ఉంటే ఇలాంటి ఘోరాలు జరిగేవి కాదని షర్మిల పేర్కొన్నారు. పేరుకే ఉక్కు సంకల్పం అని, తెరవెనుక ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ అని ఘాటు విమర్శలు చేశారు. ప్రమాదం కారణాలపై ఉన్నతస్థాయి కమిటీ నియమించి విచారణ చేపట్టాలని, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలను అన్నివిధాలుగా తక్షణమే ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.

