కలం, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల (Municipal Polls) ప్రచార పర్వం ఊపందుకుంది. అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న ప్రచార శైలి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎన్నికలను తలపించేలా ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఉన్న 260 వార్డులకు గాను 1,072 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది.
మహబూబాబాద్ మున్సిపాలిటీలో (Municipal Poll) అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం సాగుతోంది. 17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బాలు చౌహాన్ తరపున స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ (MLA Murali Naik) వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించిన ఆయన ఓ ఇంట్లో చిన్నారికి స్నానం చేయిస్తున్న తల్లిని చూసి స్వయంగా ఆ పిల్లాడికి స్నానం చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదేవిధంగా 29వ వార్డులో సీపీఎం అభ్యర్థి సుర్ణపు సోమయ్య పలు కులవృత్తి పనులు చేస్తూ ఓటర్లను ఆకట్టుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి మంగళంపల్లి రాజ్ కుమార్ కూడా తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు.
తొర్రూరు మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar) విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిరు వ్యాపారులు, కిరాణా షాపు యజమానులను కలుస్తూ ఓట్లని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో ఒక హోటల్‌లో టీ తయారు చేస్తూ యజమానిని ఓటు వేయాలని కోరడం విశేషం. మరోవైపు వర్ధన్నపేట మున్సిపాలిటీలో అధికార పార్టీ ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మున్సిపల్ వార్డుల్లో రాజకీయం వేడెక్కింది.
Read Also: అప్పుడు నాట్లకు నాట్లకు మధ్య.. ఇప్పుడు ఓట్లకు ఓట్లకు మధ్య..
Follow Us On: Instagram


