కలం, కరీంనగర్: బీఆర్ఎస్ నేతలే దేశంలో అతి పెద్ద 420లని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు (Velichala Rajender Rao) ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా.. రైతులకు చుక్కనీరు అందించలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజేందర్ రావు పాల్గొన్నారు. ఇందిరా చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. రాజీవ్ చౌక్, గాంధీ చౌక్, బాబు జగ్జీవన్‌రామ్ చౌక్ మీదుగా కోర్టు చౌరస్తా, అంబేద్కర్ చౌక్ వరకు సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వెలిచాల రాజేందర్రావు, కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజేందర్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విషప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు. “పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా ఇచ్చిందా?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలకు అందించే కార్యక్రమం కొనసాగుతోందని, ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. రెండో విడతలో మరో రెండు లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ.. రూ.22 వేల కోట్లతో 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు రాజేందర్రావు తెలిపారు. పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, గ్యాస్ సబ్సిడీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రాబోయే రోజుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని స్పష్టం చేశారు. బీజేపీ నేతల పరిస్థితి అధ్వానంగా తయారైందని, “రాత్రి డీల్.. తెల్లారితే రీడీల్” అంటూ ఆ పార్టీ నేతల తీరుపై విమర్శలు గుప్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, వేల్పుల వెంకటేష్, గసిగంటి కుమార్, కోడూరి రవీందర్‌గౌడ్, మిడిదొడ్డి కపిల్ మాధవ్, తిప్పారపు శ్రీనివాస్, రాచర్ల పద్మ, మాలోతు మహాలక్ష్మి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

