కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ నగర అభివృద్ధిలో కీలకమైన భద్రకాళి చెరువు (Bhadrakali Lake) పునరుద్ధరణకు మరోసారి శ్రీకారం చుట్టామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) తెలిపారు. గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పూడికతీత పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ఇప్పుడు రూ.16.10 కోట్ల నిధులతో సమగ్రంగా చెరువు పూడికతీత పనులను చేపడుతున్నామని చెప్పారు. శుక్రవారం 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ (Collector Chahat Bajpai), నగర మేయర్ గుండు సుధారాణిలతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఎలాంటి అంతరాయాలు లేకుండా చెరువు పునరుద్ధరణ, మాడ వీధుల పనులు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా ఓటు బ్యాంకు రాజకీయాలు చూడలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే తమకు చెడ్డపేరు వస్తుందనే భయంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సమిష్టి నాయకత్వంతో వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
భద్రకాళి చెరువు సుందరీకరణలో భాగంగా ఆలయం నుంచి చెరువు బండ్ వైపు గ్లాస్ వంతెన ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా భక్తులు వచ్చి దర్శించుకునేలా భద్రకాళి ఆలయాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత పాలకులు అమ్మవారి పేరును రాజకీయ లబ్ధికి వినియోగించుకున్నారని, తమ అనుచరులకు ఆలయ పరిసరాల్లో వ్యాపార సంస్థలు ఇచ్చి రేట్లు పెంచి ప్రజలకు భారంగా మార్చారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) విమర్శించారు. గతంలో 70 ఏళ్ల క్రింద పూడికతీత జరిగిన చెరువును నేడు మళ్లీ మా హయాంలో జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
Read Also: వెరీ షేమ్.. పాక్ క్రికెటర్‌ను కొంటారా, SRHపై నెటిజన్స్ ఫైర్
Follow Us On: Facebook

