నేరాల నివారణకు ‘కమ్యూనిటీ కనెక్ట్’: సీపీ శ్వేత

కలం, వరంగల్ బ్యూరో: నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ‘కమ్యూనిటీ కనెక్ట్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత (Warangal CP Shwetha) తెలిపారు. నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా పోలీసులే నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వివిధ రకాల నేరాలు, మోసాల నివారణపై అవగాహన కల్పించనున్నారు.

ప్రస్తుతం సైబర్, సోషల్ మీడియా మోసాలు, మహిళలు, చిన్నారులపై నేరాలు, ఇళ్లల్లో దొంగతనాలు, దృష్టి మరల్చి చేసే నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లను అపరిచితులతో పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను తెరవవద్దని సూచించనున్నారు. మహిళలు, చిన్నారుల భద్రత, ఆస్తుల పరిరక్షణ, ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాలనీలు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాధాన్యాన్ని వివరించనున్నారు.

మొదట 9 పోలీస్ స్టేషన్లలో..

గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటి అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణలో ప్రజల పాత్రపై అవగాహన కల్పిస్తారని సీపీ శ్వేత తెలిపారు. సాధారణంగా పోలీస్ శాఖ నిర్వహించే అవగాహన కార్యక్రమాలకు మహిళలు, వృద్ధులు, చిన్నారులు సహా అన్ని వర్గాల ప్రజలు హాజరుకావడం సాధ్యం కావడం లేదని… ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికీ పోలీసులే చేరువయ్యేలా కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు.

వరంగల్ నగరంలోని తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో అమలు చేసి, అనంతరం అన్ని పోలీస్ స్టేషన్లకు విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బంది ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు నేరాల నివారణకు అవసరమైన సూచనలు అందించనున్నారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువ కావడం పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>