కలం, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాగా విడిపోయి పదేళ్లు దాటుతున్నా వరంగల్‌కు సొంత కలెక్టరేట్ (Warangal Collectorate) భవనం లేదు. నిర్మాణం పూర్తయి చాలాకాలమే అయినా ఇంకా ప్రారంభానికి ముహూర్తం ఖరారు కావడంలేదు. ఒకసారి పనులు.. మరోసారి ప్రారంభ ఏర్పాట్లు.. ఇంకోసారి తేదీ మార్పు.. ఇలా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వరంగల్ జిల్లా పరిపాలన ఇప్పటికీ హనుమకొండ కేంద్రంగానే సాగుతోంది.
ఇంకోవైపు రాజకీయ పార్టీల ఆందోళనలు కామన్ గా మారాయి. వరంగల్ రెండు జిల్లాలుగా ఏర్పడినప్పటికీ.. పరిపాలనా పరంగా ఒకే ప్రాంతంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి కలెక్టరేట్ పనుల కోసం వచ్చే ప్రజలు హనుమకొండకు వెళ్లాల్సి వస్తోంది. భూములు, రెవెన్యూ, సంక్షేమం, వివిధ ధ్రువపత్రాలు, ప్రభుత్వ పథకాలు, ఫిర్యాదులు తదితర పనులకు జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు ప్రయాణ భారం తప్పడం లేదు.
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత
2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించి వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలను ఏర్పాటు చేసింది. అనంతరం వరంగల్ రూరల్ జిల్లా పేరు వరంగల్‌గా, వరంగల్ అర్బన్ జిల్లా పేరు హనుమకొండగా మార్చింది. 2021లో అజంజాహీ మిల్స్ లో స్థలాన్ని ఎంపిక చేసి రూ. కోట్లాది వ్యయంతో ఆధునిక వసతులతో భవన నిర్మాణం చేపట్టారు. పూర్తయిన తర్వాత కూడా భవనాన్ని ప్రారంభించకపోతుండగా ప్రజలకు ఎదురుచూపులు తప్పడంలేదు.
మరోవైపు ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలన్న లక్ష్యం కలెక్టరేట్ లేకపోవడంతో పూర్తిస్థాయిలో నెరవేరడంలేదు. వివిధ పనులు ఇంకా మిగిలి ఉన్నాయన్న కారణాలతో ప్రారంభం వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది అధికారులు భవనాన్ని పరిశీలించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా.. ప్రభుత్వం స్పష్టమైన ప్రారంభ తేదీని ప్రకటించకపోవడంతో సందిగ్ధత నెలకొంది.
వాయిదాలపై రాజకీయ విమర్శలు
కలెక్టరేట్ ప్రారంభం ఆలస్యంపై ఎందుకు ప్రారంభించడం లేదని ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమైనందునే ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం భవనం పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాతే ప్రారంభిస్తామని చెబుతోంది. నిర్మాణానికి సంబంధించిన పనులు, ఏర్పాట్లు, అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
గుమ్మడికాయలతో వినూత్న నిరసన
కలెక్టరేట్ ప్రారంభ జాప్యంపై గత నెల 29న బీజేపీ శ్రేణులు వినూత్నంగా నిరసన చేపట్టాయి. క్యాంపు ఆఫీసు నుంచి కొత్త కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసి.. అనంతరం మెయిన్ గేట్ వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీశారు. భవనాన్ని ప్రారంభించకపోవడానికి ఎవరి దిష్టి తగిలిందోనంటూ నిరసన తెలిపారు. వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం భవనం సమస్య మాత్రమే కాదని.. జిల్లా కేంద్రం అనే భావన, పరిపాలనా వికేంద్రీకరణ, ప్రజలకు ప్రభుత్వ సేవల చేరువ వంటి అంశాలతో ముడిపడి ఉందని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి.
ఇదే సమయంలో రెండు జిల్లాలను తిరిగి ఒకటిగా చేయాలన్న డిమాండ్ కూడా సందర్భానుసారం తెరపైకి వస్తోంది. జిల్లాల విభజనతో పరిపాలనా సమస్యలు, ప్రజల ప్రయాణ ఇబ్బందులు పెరిగాయని పేర్కొంటూ పలు పౌర సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. జిల్లాల విలీనం ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించినదే కాగా.. ప్రస్తుతం వరంగల్ కలెక్టరేట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ప్రజలను వేధిస్తున్న ప్రశ్నగా తయారైంది.

