రాఖీ రద్దీలో రికార్డు రాబడి.. వనపర్తి డిపోకు 137శాతం ఓఆర్!

కలం, వనపర్తి: ఆగస్టు నెలలో వనపర్తి డిపో (Wanaparthy RTC Depot) 100 శాతం ఓఆర్‌ సాధించడం కూడా ఉద్యోగుల సమిష్టి కృషికి నిదర్శనమని డిపో మేనేజర్‌ దేవేందర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. గురువారం వనపర్తి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ గేట్‌ మీటింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమి సందర్భంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్స్‌లో వనపర్తి ఆర్టీసీ డిపో ఉద్యోగులు సమిష్టిగా కృషి చేసి 137 శాతం ఓఆర్‌ (ఆపరేటింగ్‌ రేషియో) సాధించారనీ తెలిపారు.

పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సర్వీసు బస్సులను పూర్తిస్థాయిలో నడపడమే కాకుండా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు ట్రిప్పులు నిర్వహించి అధిక ఆదాయం సమకూర్చారని ఆయన ప్రకటించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విధులు నిర్వహిస్తూ అదనపు ట్రిప్పులు నడిపి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అధిక ఆదాయం సాధించిన డ్రైవర్లు, కండక్టర్లు, మెయింటెనెన్స్‌ సిబ్బంది, సూపర్‌వైజర్లు, ఇతర ఉద్యోగులను అభినందించారు.

ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు రాఖీ స్పెషల్‌ ఆపరేషన్స్‌లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేసి వారి సేవలను ప్రశంసించారు. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కలుపుకొని రాఖీ పౌర్ణమి రోజున నమోదైన ఆదాయంతో డిపో ఈ ఘనత సాధించిందని తెలిపారు. ఉద్యోగులందరూ ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పనిచేసి మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు జయకృష్ణ, కృష్ణ, ఎస్‌డీఐ కృష్ణ, కంట్రోలర్లు, డిపో సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>