కలం, ఖమ్మం బ్యూరో: వైఎస్ రాజశేఖరరెడ్డిను మంచి ప్రస్తుత ఏపీ పాలకులు జల దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ఆరోపించారు. తెలంగాణ హక్కులను కాలరాస్తున్న ఏపీ పాలకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొణిజర్ల మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన, నీటి దోపిడీపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాలను తేల్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్, పోతిరెడ్డిపాడు, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా ఏపీ ప్రభుత్వం నీటిని తరలించుకుపోతున్నా రేవంత్ ప్రేక్షక పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుంటే, ఏపీ దోపిడీకి మాత్రం ప్రభుత్వం సహకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ‘పువ్వాడ’ అనే పేరును లేకుండా చేయడమే లక్ష్యంగా కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
రఘునాథపాలెం మండలంలో సొంత నిధులతో నిర్మించిన రైతు వేదికకు తన సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ పేరును తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. జిల్లాలోని ముగ్గురు మంత్రులు భూములు, ఇసుక, మట్టి దోపిడీలు, కమీషన్ల దందాకే పరిమితమయ్యారని ఆరోపించారు. సీతారామ ఎత్తిపోతల, రాజీవ్ కెనాల్ పనులను పూర్తిగా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రైతుల సమస్యలు, తెలంగాణ నీటి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుందని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

