కలం, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తీవ్ర అన్యాయం చేసిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు డివిజన్లోని మైత్రి మైదానంలో వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే గూడెం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 5 లక్షల భరోసా కార్డు, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంశాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. జీవో నెంబర్.97తో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడటం వద్దని, విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు.

