వనపర్తి బడులకు నిధుల వరద.. 15 అభివృద్ధి పనులకు రూ. 3.15 కోట్లు మంజూరు!

కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.3.15 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) చొరవతో సమర్పించిన ప్రతిపాదనల మేరకు మొత్తం 15 అభివృద్ధి పనులకు రూ.3 కోట్ల 15 లక్షల 16 వేల నిధులు కేటాయించారు. అదనపు తరగతి గదులు, సైన్స్‌ ల్యాబ్‌లు, కంప్యూటర్‌ గదుల నిర్మాణంతో పాటు పాఠశాలల మరమ్మతులు చేపట్టనున్నారు.

పెబ్బేరు మండలం చెలిమిల్ల ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల మిగిలిన నిర్మాణ పనులకు రూ.15 లక్షలు, పెబ్బేరు భవిత కేంద్రంలో యాక్టివిటీ రూముల నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించారు. వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.23.80 లక్షలు మంజూరయ్యాయి. వనపర్తి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సైన్స్‌ ల్యాబ్‌కు రూ.26 లక్షలు, కంప్యూటర్‌ గదికి రూ.25 లక్షలు, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో కంప్యూటర్‌ గదికి రూ.25 లక్షలు కేటాయించారు.

యెడుల ప్రాథమిక పాఠశాలలో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.23.80 లక్షలు మంజూరయ్యాయి. గోపాల్‌పేట కస్తూర్బా విద్యాలయంలో కంప్యూటర్‌ గదికి రూ.25 లక్షలు, సైన్స్‌ ల్యాబ్‌కు రూ.26 లక్షలు, ఘనపూర్‌ కస్తూర్బా విద్యాలయంలో సైన్స్‌ ల్యాబ్‌కు రూ.26 లక్షలు కేటాయించారు. రేవల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ల్యాబ్‌కు రూ.26 లక్షలు, రేవల్లి కస్తూర్బా విద్యాలయంలో సైన్స్‌ ల్యాబ్‌కు రూ.26 లక్షలు మంజూరయ్యాయి.

రేవల్లి మండలం కేశంపేట ప్రాథమిక పాఠశాల మరమ్మతులకు రూ.4.56 లక్షలు, ఘనపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మరమ్మతులకు రూ.15 లక్షలు, ఘనపూర్‌ మండలం సోలిపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మరమ్మతులకు రూ. 18 లక్షలు కేటాయించారు.

ఆధునిక విద్యకు ప్రాధాన్యం

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ బోధన, సైన్స్‌ ప్రయోగశాలలు, కంప్యూటర్‌ విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. అంగన్‌వాడీ, పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యా వ్యవస్థలో మార్పులకు చర్యలు చేపడుతోంది. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ద్వారా ఒకే ప్రాంగణంలో విద్యాబోధన, వసతి, సైన్స్‌, కంప్యూటర్‌, ఏఐ, స్కిల్‌ ల్యాబ్‌లు, క్రీడా సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లలోనూ ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఆధునిక విద్యా సదుపాయాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది.

ఇందులో భాగంగా వనపర్తి మండలం వెల్టూరులో రూ.11.75 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్రంలోని ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌, జర్మనీ తదితర దేశాలకు పంపించి అక్కడి బోధనా పద్ధతులు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఆధునిక విద్యా విధానాలను అధ్యయనం చేయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి గ్రామీణ విద్యార్థులకు ఆధునిక విద్యా అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడంపై ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టి సారించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>