కలం, వనపర్తి: జిల్లా అథ్లెట్లు గతంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత క్రీడాకారులు రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు వనపర్తి జిల్లా జట్టును (Wanaparthy Athletes) ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయి సెలెక్షన్స్ ఆదివారం స్థానిక డాక్టర్ బాలకృష్ణయ్య స్టేడియం మైదానంలో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 200 మంది అథ్లెట్లు ఎంపికల్లో పాల్గొన్నారు.
ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2026 పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులను ఈ ఎంపికల ద్వారా ఖరారు చేయనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నందిమల్ల శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు వాకిటి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై అథ్లెట్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు ఈవెంట్లలో సాధనతోపాటు శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
వనపర్తి జిల్లా అథ్లెట్లు గతంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించారని, అదే స్ఫూర్తితో ప్రస్తుత క్రీడాకారులు రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని శ్రీధర్ ఆకాంక్షించారు. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ పీడీగా అవార్డు పొందిన నందిమల్ల శ్రీకాంత్‌ను వాకిటి శ్రీధర్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎండీ షంషీర్ అలీ, సీనియర్ ప్లేయర్ అహ్మద్, పీడీ నందన్, పీఈటీలు జబ్బార్, మహేశ్, ఉమాశంకర్, దామోదర్, అజయ్, వహీద్, గోవింద్, మాలతి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

