కలం , వనపర్తి : మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు క్రమేణా పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ నిర్ణయాలతో కుదేలవుతుందని బీఆర్ఎస్ వనపర్తి (Wanaparthy) జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఆరోపించారు. రేవంత్ సర్కార్ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ యజమానులు, మధ్యవర్తులు రోడ్డుపై పడాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం వనపర్తి లో బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో పాత వెంచర్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎల్.ఆర్.ఎస్ ఫీజు కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం వల్ల కొద్దిగా ఉపశమనం కలిగి రియల్టర్స్, మధ్యవర్తులు ఊపిరి పీల్చుకొని కాస్తో, కూస్తో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు అని అశోక్ అన్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అకస్మాత్తుగా తేదీ 06.07.2026 రోజు జి.ఓ నం.5509/2025ను తెరమీదికి తెస్తూ పాత వెంచర్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడం దారుణమని ఫైర్ అయ్యారు.
స్వతహాగా ముఖ్యమంత్రి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని అని , రియల్ ఎస్టేట్ రికార్డ్ స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకొస్తానని చెప్తుంటారని గుర్తు చేశారు. అయితే ఆయన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వ్యాపారం దారుణంగా నష్టపోయి అప్పులు చెల్లించలేక రియాల్టర్స్ ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. రియల్ ఎస్టేట్ పై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది మధ్యవర్తులు,ఏజెంట్లు ఉపాధిలేక సతమతమవుతున్నారని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకనాడు ఎకరం కోటి రూపాయలు పలికిన ధరలు ఇప్పుడు దారుణంగా పడిపోయి లక్షలకు కూడా ఎవ్వరూ కొనడం లేదన్నారు. దీని ప్రభావం అన్ని వ్యాపారాలపై పడి ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆరోపించారు. రియల్టర్లకు ప్రస్తుతం మార్కెట్లో ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టడం లేదని.. ఉన్న భూములు కూడా అమ్ముడు పోవడం లేదని తెలిపారు. దీంతో రియల్టర్లు తమ పిల్లలకు వివాహాలు, పై చదువులు, ఇంటి నిర్మాణాలు వాయిదా వేసుకొని తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జి.ఓను ఉపసంహరించుకుని రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని అశోక్ డిమాండ్ చేశారు.

