కలం, వనపర్తి: భూభారతి (Bhu Bharati) విధానం ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు వేగవంతంగా, పారదర్శకంగా జరిగేలా జూనియర్ అసిస్టెంట్లు పూర్తి అవగాహనతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ మండలాల జూనియర్ అసిస్టెంట్లకు భూభారతి రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రెవెన్యూ శాఖలో భూభారతి విధానం కీలకమైనదని, రైతులు, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆ లక్ష్య సాధనలో జూనియర్ అసిస్టెంట్ల పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, డిజిటల్ సంతకాలు, సంబంధిత పత్రాల పరిశీలన వంటి ప్రక్రియలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. లాగిన్ ప్రక్రియ నుంచి దరఖాస్తుల ఆమోదం వరకు ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించి సాంకేతిక లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, శిక్షణలో కలిగే సందేహాలను మాస్టర్ ట్రైనర్ల ద్వారా వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి భాను ప్రకాష్, మాస్టర్ ట్రైనర్లు, జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

