కలం, కరీంనగర్ బ్యూరో: ఓలా–ఉబర్ తరహా ఆటో, బైక్ టాక్సీ సేవల వల్ల సంప్రదాయ ఆటో డ్రైవర్ల ఉపాధి తీవ్ర సంక్షోభంలో పడిందని ఆరోపిస్తూ కరీంనగర్ (Karimnagar) జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మికులు వినూత్నంగా భిక్షాటన నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆటో కార్మికుల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు.
యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం అమలుతో ఇప్పటికే ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిపోయిందని, ఇప్పుడు ఓలా–ఉబర్ సేవలు విస్తరించడంతో పూర్తిస్థాయిలో ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులను ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు.
జిల్లాలో ఓలా–ఉబర్ తరహా సేవలను నియంత్రిస్తూ సంప్రదాయ ఆటో డ్రైవర్లకు రక్షణ కల్పించే ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని, ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేసి ఉపాధి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తూ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన అనంతరం ఆటో కార్మికులు ప్రతీకాత్మకంగా భిక్షాటన నిర్వహించి తమ కుటుంబాల జీవనాధారాన్ని కాపాడాలని, సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

