కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నేడు మనం చేసే పర్యావరణ సంరక్షణే భావితరాలకు అందించే గొప్ప కానుక అని అదనపు కలెక్టర్(Additional Collector) ఎన్. ఖీమ్య నాయక్ (Kheemya Naik) అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పర్యావరణ వారోత్సవాలు మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణంలోని ఈకో పార్క్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పార్క్‌కు వచ్చే ప్రజలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. పార్క్‌లో ఎక్కడా చెత్త, ప్లాస్టిక్ ఉండకూడదని స్పష్టం చేస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పార్క్ పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మొక్కలు పెంచే కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని అదనపు కలెక్టర్ సూచించారు. వారంలో ప్రతి రోజూ ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ప్రజలలో పర్యావరణ అవగాహన పెంపొందించాలని ఆయన తెలిపారు.
జూన్ 12 వరకు జరగనున్న ఈ వారోత్సవాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 3న సైకిల్ ర్యాలీ, వాకథాన్, 4న విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, 5న మొక్కల నాటే కార్యక్రమం, 6న ప్రకృతి పరిశీలన కార్యక్రమాలు, 8న ఈకో పార్క్ దర్శనం, 9న కమ్యూనిటీ ఈకో యాక్టివిటీలు, 10న గ్రామ స్థాయిలో మొక్కల నాటే కార్యక్రమం, 11న జూ పార్క్, అటవీ సందర్శన, 12న ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాలలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పీడీ ఆర్‌డీఓ ఉమాదేవి, అటవీ శాఖ అధికారి నరేందర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

