కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) జిల్లా వేలేరు నుండి హైదరాబాద్ వెళ్లే నూతన ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీస్‌ను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ బస్సు వేలేరులో ఉదయం 4 గంటలకు బయలుదేరి కమ్మరిపేట, బండ తండా, నారాయణగిరి, ముప్పారం, సాయిపేట, క్యాతంపల్లి, పెద్దపెండ్యాల, కరుణాపురం మీదుగా సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ కు రాత్రి 8 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి రాత్రి 8 గంటలకు వేలేరుకు చేరుకుంటుందని తెలిపారు.
ప్రయాణికులు ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఎక్స్ ప్రెస్ సర్వీస్ ద్వారా మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చని అన్నారు. జూన్ 2వ తేదీ నుండి వేలేరు వరకు వచ్చే బస్సులను గొల్లకిష్టంపల్లి వరకు పొడిగించనున్నట్లు ప్రకటించారు. ఈ బస్సు సర్వీస్ వెళ్లే ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్, వేలేరు, ధర్మసాగర్ మండలాల సర్పంచులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

