కలం, వెబ్ డెస్క్: భారత క్రికెట్ అభిమానులకు ఒక షాకింగ్ అప్‌డేట్. గత వారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ (IPL) 2026 టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లలో ఆడుతున్న సమయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యారు. ఈ కారణంగా జూన్ 13 నుంచి అఫ్గానిస్తాన్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు ఆయన దూరమయ్యారు. బీసీసీఐ (BCCI) ఆయన స్థానంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను జట్టులోకి ఎంపిక చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే జూన్ 13న ధరమ్‌శాలలో, రెండో వన్డే జూన్ 17న లక్నోలో, చివరి వన్డే జూన్ 20న చెన్నైలో జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తోడుగా ఉండటం ఎంత అవసరమో మాజీ ఆటగాడు సురేష్ రైనా వివరించారు. టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు దిగ్గజాలు వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో గిల్‌కు వీరి అనుభవం ఎంతో ప్లస్ అవుతుందని రైనా పేర్కొన్నారు. 2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 5 శతకాలతో 648 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారని, అలాగే 2023 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 765 పరుగులతో సచిన్ రికార్డును బద్దలు కొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచారని గుర్తు చేశారు. పెద్ద టోర్నీలలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో వీరికి బాగా తెలుసని, వీరి ఉనికి యువ ఆటగాళ్లకు , కెప్టెన్ గిల్‌కు మైదానంలోనూ, వెలుపలా పెద్ద అండగా మారుతుందని రైనా అభిప్రాయపడ్డారు.
మరోవైపు మాజీ స్పిన్నర్, కోచ్ అనిల్ కుంబ్లే కూడా కెప్టెన్‌గా గిల్ ప్రదర్శనను ప్రశంసించారు. ఐపీఎల్‌లో గిల్ కెప్టెన్సీని మనం చూశామని, ఒత్తిడి సమయాల్లో ఆయన బౌలర్లను బాగా వాడుకున్నారని చెప్పారు. సాధారణంగా కెప్టెన్సీ బాధ్యతలు వచ్చినప్పుడు ఆటగాళ్ల బ్యాటింగ్ ఫామ్ తగ్గుతుందని, కానీ గిల్ విషయంలో అలా జరగలేదని కుంబ్లే అన్నారు. గిల్ తన బ్యాటింగ్ పైన ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడుతున్నారని తెలిపారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు పక్కన ఉండటం వల్ల గిల్‌కు ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్ మార్పులు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం సులువవుతుందని కుంబ్లే పేర్కొన్నారు.

