కలం, యాదగిరిగుట్ట: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ‘కళ్యాణ లక్ష్మి’ (Kalyana Lakshmi) పథకం ఒక గొప్ప భరోసా అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) అన్నారు. యాదగిరిగుట్టలోని తన కార్యాలయం వద్ద ఆలేరు నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన స్వయంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమాన్ని ముందస్తుగా దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
అందులో భాగంగానే ఆడబిడ్డల వివాహ సమయంలో తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమకు సకాలంలో ఆర్థిక సాయం అందడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

