కలం, వెబ్ డెస్క్ : వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి (Basireddipalle) గ్రామం సమీపంలో పెద్దపులి కలకలం రేపింది. స్థానిక కృష్ణగిరి క్షేత్ర ఆలయ పరిధిలోని గోశాలలో ఉన్న గోవులపై పెద్దపులి దాడి చేయడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మూడు రోజుల క్రితమే ఒక లేగదూడను ఎత్తుకెళ్లిన పులి, తాజాగా మరొక ఆవుపై దాడికి దిగింది. ఇది గమనించిన గో సంరక్షకుడు గట్టిగా కేకలు వేస్తూ పరుగెత్తడంతో పులి అక్కడి నుంచి పారిపోయింది. అయితే, ఈ దాడిలో ఆవు మెడ, ఉదర భాగంలో తీవ్ర గాయాలవ్వడమే కాకుండా వీపుపై పులి పంజా గుర్తులు పడ్డాయి. తీవ్రంగా గాయపడిన ఆవు కొద్దిసేపటికే మృతి చెందింది. పక్కనే ఉన్న ఒక ఫామ్‌హౌస్ సీసీ టీవీ కెమెరాల్లో పులి కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి.
గోశాలలో దాదాపు 200 వరకు ఆవులు ఉన్నాయని నిర్వాహకులు కృష్ణ స్వామి తెలిపారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి పులిని బంధించి, సురక్షితంగా వేరే అడవిలో వదిలిపెట్టి గోశాలలోని ఇతర గోవులను, గ్రామస్థులను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

